హైదరాబాద్ లో నిన్న జరిగిన కాపు నేతల సమావేశంలో చిరంజీవి ఒక ఇబ్బందికరమైన ప్రశ్న ఎదుర్కొన్నట్లు సమాచారం. సమావేశానికి హాజరైనవారిలో కొందరు మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ముద్రగడ పద్మనాభం దీక్ష గురించి రాష్ట్రంలో ఇంత చర్చ జరుగుతుంటే, ఆయన స్పందించరా? అని చిరంజీవిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వారి ప్రశ్నలకు చిరంజీవి వద్ద కూడా సరైనా సమాధానం లేకపోవడంతో జవాబు చెప్పడానికి ఆయన కూడా ఇబ్బందిపడినట్లు తెలుస్తోంది. తన తమ్ముడు ఏమి చేస్తున్నాడో, ఈ వ్యవహారంపై స్పందిస్తాడో లేదో తనకి తెలియదని చిరంజీవి జవాబు చెప్పినట్లు తెలుస్తోంది.
అన్నదమ్ములుగా వారు ఒకరినొకరు గౌరవించుకొంటునప్పటికీ, రాజకీయంగా వారు విభేధించుకొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అదే విధంగా సమస్యల పట్ల వారిరువురూ స్పందించే తీరు కూడా వేరేగా ఉంటుంది. చిరంజీవి ఎప్పుడూ ఒక సాధారణ రాజకీయనాయకుడిలాగే మాట్లాడుతుంటారు కనుకనే కాపుల రిజర్వేషన్లు, ముద్రగడ నిరాహార దీక్ష, ప్రభుత్వ వైఖరి పట్ల ఒక సాధారణ కాంగ్రెస్ నేతలాగే స్పందించారు. అందులో ఆశ్చర్యమేమీ లేదు.
ఒకవేళ పవన్ కళ్యాణ్ తెదేపాతో అనుబంధం వద్దనుకొని ఉంటే చాలా ఘాటుగానే స్పందించి ఉండేవారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరిని, ముద్రగడ వైఖరిని కూడా ఆయన తప్పుపట్టి ఉండేవారేమో. పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఆవిధంగా స్పందించే ధైర్యం ఉంది కనుకనే నేటికీ ఆయన మాటకి అంత విలువ ఉంది. కొమ్ములు తిరిగిన రాజకీయ నేతలు కూడా ఆయన స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. కానీ, తెదేపా, భాజపాలతో అనుబంధం పవన్ కళ్యాణ్ కాళ్ళకి బంధంలా తయారయిందని చెప్పవచ్చు. వాటిని ఆయన వదిలించుకొంటే తప్ప మునుపటి పవన్ కళ్యాణ్ ని చూడలేము. వాటిని దూరంగా పెట్టడానికి ఆయనకి ఏమి సమస్యలున్నాయో తెలియదు కనుక వాటితో అనుబంధం కొనసాగిస్తున్నారు. ఒకవేళ తప్పనీసరి పరిస్థితులలో ఆయన మీడియా ముందుకు వచ్చినా తెదేపా ప్రభుత్వానికి అనుకూలంగానే మాట్లాడవలసి ఉంటుంది. దాని వలన ఇంకా విమర్శలు మూటగట్టుకోవడమే తప్ప వేరే ప్రయోజనం ఉండదు. బహుశః అందుకే పవన్ కళ్యాణ్ ఇంత గంభీరమైన సమస్యపై కూడా మౌనం వహిస్తున్నారేమో? పవన్ కళ్యాణ్ స్వయాన్న తమ్ముడే కావడంతో అప్పుడప్పుడు ఇటువంటి ఇబ్బందికరమైన ప్రశ్నలకు జవాబులు ఇచ్చుకోవలసి వస్తోంది. అంతే! చిరంజీవికి అటువంటి ఇబ్బందులు, పరిమితులు ఏవీ లేవు కనుక సగటు కాంగ్రెస్ నేతలాగ చాలా చక్కగా స్పందించారని భావించవచ్చు.