చిరంజీవి… ఈ పేరు వినగానే కళ్ళముందు అనేక సిగ్నేచర్ డ్యాన్స్ మూమెంట్స్ కదులుతాయి. సినిమా పాటల్లో డ్యాన్సలతో ఓ సంచలనం సృష్టించిన హీరో చిరు. డ్యాన్సుల్లో ఆయన గ్రేస్, స్టయిల్ వేరే లెవల్. ఇప్పుడాయన డ్యాన్స్ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ కి ఎక్కింది. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు చిరు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ ని అందుకున్నారు. గిన్నిస్ బుక్ ప్రతినిధులు, బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు పాల్గొని చిరంజీవికి అభినందనలు తెలిపారు.
దశాబ్దాలుగా ప్రేక్షకులని అలరిస్తున్న చిరంజీవి ఖాతాలో అనేక అవార్డులు వున్నాయి. సినీ రంగానికి ఆయన చేస్తున్న సేవలు గుర్తించిన ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులతో గౌరవించింది. దీంతో పాటు మూడు నంది, తొమ్మిది ఫిల్మ్ ఫేర్ అవార్డులు ఆయన సొంతం. ఇప్పుడు ఆయన కిరీటంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ చేరింది. త్వరలోనే అక్కినేని నేషనల్ అవార్డ్ అందుకోబోతున్నారు చిరు. అక్టోబర్ 28న జరిగే ఈ వేడుకు అమితాబ్ బచ్చన్ చీఫ్ గెస్ట్ గా రానున్నారు.