హైదరాబాద్: ఈ ప్రపంచంలో తాను అత్యంతంగా ప్రేమించేది తన భార్య సురేఖనేనని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. చరణ్ ఏదైనా అడిగితే తాను కాదని చెప్పగలనని, సురేఖ అడిగితే కాదనలేనని అన్నారు. ఒక జాతీయ ఆంగ్ల దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, సురేఖలో బాగా ఇష్టమైనదేమిటని అడిగిన ప్రశ్నకు సమాధానంగా, తనకు చరణ్‌ను, అద్భుతమైన ఇద్దరు కూతుళ్ళను బహుమతిగా ఇచ్చిందని చెప్పారు. ఆమె తనకు షాక్ అబ్జార్బర్, స్ట్రెస్ బస్టర్‌గా వ్యవహరిస్తుంటుందని అన్నారు. కెరీర్లో అపజయాలగురించి మాట్లాడుతూ, అదృష్టవశాత్తూ ప్రొడ్సూసర్లు, డైరెక్టర్ల ఇళ్ళచుట్టూ తిరగాల్సిన అవసరం తనకు ఎప్పుడూ రాలేదని, వరసగా సినిమాలలో అవకాశాలు వచ్చాయని చెప్పారు. కెరీర్ మొత్తంలో కొద్దికాలం తప్పితే ఒక్క సంవత్సరంకూడా తనకు హిట్ లేకుండా లేదని, 1995లోమాత్రం వరసగా ఫ్లాప్‌లు రావటంతో ఆరునెలలు మేకప్ వేసుకోకుండా ఖాళీగా ఉన్నానని తెలిపారు. సల్మాన్‌కు తనకు మధ్య స్నేహంగురించి చెబుతూ, అతనొక మంచి మనిషి అని తాను ముంబాయి ఎప్పుడు వెళ్ళినా తనను ఇంటికి తీసుకెళతాడని, మంచి ఆతిథ్యం ఇస్తాడని చెప్పారు. అతనికి తానంటే ఎంతో ఇష్టమని, థమ్స్ అప్ యాడ్ షూటింగ్ సమయంనుంచి తాము సన్నిహితులమయ్యామని తెలిపారు.
చరణ్గురించి మాట్లాడుతూ, అతను ఎంతో పరిణతి చెందినవాడని, వయసుకు మించిన ఆలోచనలు అతనిలో ఉన్నాయని అన్నారు. ఒక్కోసారి అతను తనను అప్రమత్తం చేస్తాడని, డాడీ అలా మాట్లాడొద్దు, బాగుండదు అని చెబుతాడని వెల్లడించారు. అతనిలో ఒకే ఒక్క బ్యాడ్ క్వాలిటీ కోపం అని, చాలా త్వరగా కోపం వచ్చేస్తుందని చెప్పారు. దీనిగురించి ఏమైనా అంటే తన తాత గుణమే తనకొచ్చిందని, తానేమీ చేయలేనని చరణ్ అంటాడని చిరు వెల్లడించారు. షూటింగ్‌కు అప్పుడప్పుడూ లేట్‌గా వెళుతూ ఉంటాడని, అలా వెళ్ళొద్దని చెబుతూ ఉంటానని తెలిపారు. వందలమంది నీకోసం వేచిచూస్తూ ఉంటారని హెచ్చరిస్తూ ఉంటానని అన్నారు. తాను షూటింగ్‌కు ఎప్పుడూ లేటుగా వెళ్ళనని, ఒకవేళ లేట్ అయితే తనకు టెన్షన్‌గా ఉంటుందని చిరంజీవి చెప్పారు.