చిరు కెరీర్లో హిట్లూ, ఫ్లాపులు, డిజాస్టర్లు చూశారు ఫ్యాన్స్. ఎలాంటి సినిమాకి ఎలా రియాక్ట్ అవ్వాలో వాళ్లకు బాగా తెలుసు. కాస్త యావరేజ్ సినిమా వచ్చినా, దాన్ని హిట్ చేసేస్తుంటారు చిరు ఫ్యాన్స్. చిరుకి ఉన్న స్టామినా, ఆయన అభిమానులకు ఆయనపై ఉన్న ప్రేమ అది. చిరు ఫ్లాప్స్ ఇవ్వొచ్చు. కానీ.. అలాంటి ఫ్లాప్ లోనూ ఎక్కడో ఓ చోట, చిరు తన ఫ్యాన్స్‌కి ఎప్పటిలానే నచ్చేస్తుంటాడు.
సినిమా బాలేదు.. కానీ డాన్సులు అదిరిపోయాయ్.
సినిమా ఫ్లాప్.. కానీ చిరు స్టైల్ కోసం చూడొచ్చు.
సినిమా పోయింది… కానీ చిరు చేసిన ఆ కామెడీ బిట్టు..
– అంటూ పోయిన సినిమా గురించి కూడా గొప్పగా చెప్పుకొంటుంటారు చిరు ఫ్యాన్స్. కానీ భోళా శంకర్ ఆ అవకాశం ఏమాత్రం ఇవ్వలేదు. రెండున్నర గంటల సినిమాలో ఒక్కటంటే ఒక్క హై మూమెంట్ లేకుండా జాగ్రత్త పడ్డాడు మెహర్ రమేష్. చిరు సినిమా ఎలా ఉన్నా, పాటలు మాత్రం బాగుంటాయ్. దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది. సినిమా మొత్తం నచ్చినా నచ్చకపోయినా ఓ పాట మొదలయ్యే సరికి చిరు ఫ్యాన్స్ థియేటర్లో ఊగిపోతుంటారు. కానీ భోళా శంకర్‌లో తొలిసారి.. ఓ పాట వస్తే.. జనాలు లేచి బయటకు వెళ్లిపోవడం కంట కనపడింది. ఇది కూడా కచ్చితంగా మెహర్ రమేష్ క్రెడిట్టే.
సాధారణంగా చిరు ఫ్యాన్స్ తమ హీరో సినిమా ఫ్లాప్ అంటే ఒప్పుకోరు. ఫ్లాప్ అని తెలిసినా తొలి మూడు రోజులు కాస్త ఓపిక పడతారు. చివరికి ఒప్పుకోక తప్పదు. అది వేరే విషయం. కానీ.. భోళా అలా కాదు. ఫస్ట్ డే, ఫస్ట్ షో అవ్వగానే, ఈ సినిమాని వదిలేశారు. ఫ్లాపయ్యింది అని వాళ్లే స్వయంగా ప్రకటించుకొన్నారు. మెహర్ రమేష్‌ని కోట్ చేస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చిరు మొహమాటలకోసం సినిమాలు ఒప్పుకోవడం మానేయాలని, వయసుకి తగిన పాత్రలు చేయాలని, కొత్త కథలు ఎంచుకోవాలని, రీమేకులు వదిలేయాలని హితవు పలుకుతున్నారు. ఇది చిరంజీవి అభిమానుల్లో వచ్చిన మెగా మార్పు. ఇప్పుడు మారాల్సింది చిరంజీవినే. తన అభిమానులు తనని ఎలా చూడాలనుకొంటున్నారో, ఆయనకు బాగా తెలుసు. ఫ్యాన్స్ కోసం అస్తమానూ పాటలూ, ఫైట్లూ.. వీటి చుట్టూనే తిరగాల్సిన అవసరం లేదు. అభిమానుల ఆలోచనా ధోరణి మారిపోయింది. వాళ్లు పాటలూ, ఫైట్ల కోసం, పంచ్ డైలాగుల కోసం థియేటర్లకు రావడం లేదు. వాళ్లు సైతం కొత్త కథల్ని కోరుకొంటున్నారు. అభిమానుల కోసం తనని తాను మార్చుకొనే హీరోగా చిరు.. ఈ విషయాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.