చిరంజీవి ఫ్యాన్స్ Vs బ్రాహ్మణ సంఘాలు..
ఇప్పుడు బంతి… వాళ్లిద్దరి చేతికీ చిక్కింది. ఇక ఆడుకోవడమే తరువాయి.
అవును… అలయ్ బలయ్… కార్యక్రమంలో చిరంజీవి – గరికపాటి మధ్య ఏం జరిగిందో తెలిసింది. చిరుని చుట్టిముట్టి ఫొటోలు దిగుతున్న అభిమానుల్ని చూసి గరికిపాటి అసహనానికి గురయ్యారు. `మీరు ఫొటో సెషన్ ఆపకపోతే… నేను ఇక్కడ్నుంచి వెళ్లిపోతా` అని బెదిరించారు. ఆయన్ని సముదాయిస్తేగానీ శాంతించలేదు. గరికపాటి మాట విని – ఫొటో సెషన్ మధ్యలోనే ఆపేశారు చిరు. అంతేకాదు.. గరికపాటి దగ్గరకు వచ్చి కూర్చున్నారు. ఆ తరవాత గరికపాటి తన ప్రసంగాన్ని కొనసాగించారు.
అయితే అక్కడితో ఆగిపోతే బాగుణ్ణు. నాగబాబు ట్విట్టర్ వేదికగా గరికపాటిపై కౌంటర్ వేశాడు. చిరంజీవి ఇమేజ్‌ని చూస్తే ఏపాటివాడికైనా ఈపాటి అసూయ కలగడం పరిపాటే అంటూ సెటైర్ వేశాడు. చిరంజీవి ఫ్యాన్స్ సైతం – గరికపాటి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు బ్రాహ్మణ సంఘాలు రంగంలోకి దిగాయి. గరికపాటికి మద్దతుగా నిలిచాయి. సినిమాల పేరుతో వ్యాపారం చేసుకొనేవాడికీ, ప్రవచనాలు చెప్పుకొనే పండితుడికీ పోలికేంటి? అంటూ మరింత కెలికే ప్రయత్నం చేశాయి.
నిజానికి… చాలా సున్నితమైన వ్యవహారం ఇది. వెళ్లింది అలయ్ బలాయ్ కార్యక్రమానికి. దీని ఉద్దేశం ములాఖాత్ అవ్వడమే. చిరు లాంటి వ్యక్తి వచ్చినప్పుడు ఫొటోల కోసం ఎగబడడం మామూలే. ఇందులో చిరు తప్పు ఇసుమంత కూడా లేదు. “ఫొటో సెషన్ ఆపండి.. చిరంజీవిగారిని ప్రశాంతంగా వదిలేయండి.. నేను ప్రవచనం మొదలెడతా“ అని గరికపాటి హుందాగా చెప్పి ఉంటే.. ఇంత తతంగమే ఉండేది కాదు. కానీ.. ఆయన నేరుగా టార్గెట్ చేసింది చిరంజీవినే.
ఈ ఘటన జరక్కముందే చిరు తన ప్రసంగంలో గరికపాటి గారిని గౌరవించిన తీరు గుర్తు చేసుకోవాల్సిందే. గరికపాటి అవధానాకికి తను అభిమానిని అని – ఆయన్ని ఇంటికి తీసుకెళ్లి గౌరవించుకోవాలని ఉందని, హృదయ పూర్వకంగా మాట్లాడారు. తన మనసులో గరికపాటిపై ఎంత గౌరవం ఉందో చూపించుకొన్నారు. అలాంటి వ్యక్తి పట్ల.. ఇంత అసహనం చూపించడం గరికపాటి లాంటి వ్యక్తికి సమంజనం కాదు. గరికపాటితో పోలిస్తే చిరు వయసులో పెద్ద. అనుభవంలో పెద్ద. గరికపాటి పద్మశ్రీనే.. చిరంజీవి పద్మభూషణ్. కనీసం ఆ వయసుకైనా గరికపాటి గౌరవం ఇవ్వాల్సింది. చిన్నపిల్లాడిలా..`నేను వెళ్లిపోతా…` అని ఎవరైనా అలుగుతారా? అది కూడా వేదికలపై ఎక్కి మనిషి ఎలా ఉండాలి? అంటూ ఉద్భోదించే మహా మేధావులు..? అయ్యిందేదో అయ్యింది. ఇక్కడికైనా దీనికి పుల్ స్టాప్ పెట్టాలి. బ్రహ్మణ సంఘాలు, చిరు అభిమానులు.. దీన్ని పెంట పెంట చేయకుండా సమంజనం పాటించాలి. లేదంటే ఇద్దరు వ్యక్తుల ప్రతిష్టని ఇంకాస్త దిగజార్చినట్టే.