పైరసీ చిచ్చురేపుతోంది. నిర్మాతలకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. దానికి తగ్గట్టు… సినిమాలు విడుదలకు ముందే.. లీకైపోతున్నాయి. దానికి చిత్రసీమలోని వ్యక్తులే బాధ్యులు అవ్వడం బాధాకరం. ‘గీత గోవిందం’కీ ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఈ విషయమై ఆవేదన వ్యక్తం చేశారు చిరంజీవి. ‘గీత గోవిందం’ సక్సెస్ మీట్ ఈరోజు (ఆదివారం) హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సినిమా లీకైన విషయాన్ని ప్రస్తావించారు. విడుదలకు ముందు సినిమాలీకై అరవింద్ చాలా దీనావస్థలో ఉన్నారని, ఆ సమయంలో తాను ధైర్యం చెప్పానని గుర్తు చేసుకున్నారు. ”అరవింద్‌గారిలో దిగులు పోగొట్టడానికి తమ్ముడి సినిమా ‘అత్తారింటికి దారేది’ కూడా ఇలానే విడుదలకు ముందు లీకైంది కదా? కానీ… ఆ సినిమా విజయాన్ని ఆపలేకపోయింది. ‘గీత గోవిందం’ కూడా అత్తారింటికి దారేదిలా విజయాన్ని సాధిస్తుంది చూడండి’ అని ధైర్యం చెప్పా. కానీ వాస్తవానికి ఓ సినిమా ఇలా విడుదలకు ముందే బయటకు వచ్చేయడం భావ్యం కాదు. తల్లిలాంటి పరిశ్రమలో ఉంటూ, ఏదో కుర్రతనంగా సినిమాని లీక్ చేయడం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టే” అని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు.. విజయ్ దేవరకొండని ప్రశంసల్లో ముంచెత్తారు చిరు. ఈ సినిమాతో విజయ్ స్టార్‌గా మారిపోయాడని కితాబిచ్చారు. అర్జన్ రెడ్డితో పోలిస్తే ఈ సినిమాలో తన నటన చాలా వైవిధ్యంగా కనిపించిందని, ఈ సినిమాతో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరైపోయాడని అన్నారు చిరు. చిన్న పాయింట్‌తో రెండున్నర గంటలు వినోదాత్మకంగా నడిపించిన దర్శకుడు పరశురామ్నీ చిరు అభినందించారు.