ఓ హిట్టు సినిమా వచ్చిందంటే.. ముందుగా స్పందించే స్టార్ చిరంజీవినే. దర్శకుడినో, చిత్రబృందాన్నో ఇంటికి పిలిపించి మరీ అభినందిస్తుంటాడు. ఇప్పుడు తన దృష్టి గోపీచంద్ మలినేనిపై పడింది. ఈ సంక్రాంతికి `క్రాక్`తో సూపర్ హిట్టు కొట్టాడు గోపీచంద్ మలినేని. ఈ సంక్రాంతి సినిమా క్రాకే. అందుకే చిరు నుంచి పిలుపొచ్చేసింది. ఈ సినిమా గురించీ, అందులోని సన్నివేశాల గురించి.. చిరు తనదైన శైలిలో విశ్లేషిస్తూ.. గోపీచంద్ ని మెచ్చుకున్నాడట.
సాధారణంగా… చిరు దృష్టి ఎప్పుడూ సక్సెస్వైపే ఉంటుంది. హిట్టు దర్శకులతో పనిచేయడానికి ఉత్సాహం చూపిస్తుంటాడు. గోపీచంద్ మలినేనికి చిరు ఆఫర్ ఇచ్చినా.. అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమీ లేదు. పైగా… మెగా ఇంట్లో హీరోలే హీరోలు. చిరుతో కాకపోయినా.. ఎవరితోనో ఒకరితో సినిమా సెట్ చేసుకునే వీలుంటుంది. చిరు దృష్టిలో ఓ దర్శకుడు పడ్డాడంటే.. తప్పకుండా ఆఫర్ అందుకుంటాడు. అందులో డౌటే లేదు. చిరు కూడా ఈమధ్య కొత్త కథలకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఓకే చెప్పేస్తున్నాడు. తన కాంపౌండ్ లోనే ఉంటున్న మెహర్ రమేష్ లాంటివాళ్లకే చిరు ఛాన్స్ ఇచ్చాడంటే.. గోపీచంద్ మలినేని లాంటి వాళ్లకు అవకాశం ఇవ్వడంలో వింతేం ఉండదు. మొన్నటి వరకూ `లూసీఫర్` రీమేక్ ఎవరి చేతుల్లో పెట్టాలా అని చిరు తర్జన భర్జనలు పడ్డాడు. చివరికి.. మోహన్ రాజా చేతుల్లో పెట్టాడు. ఇప్పుడైతేనా… ఆ ఛాన్స్ తప్పకుండా గోపీచంద్ కే వెళ్లిపోయేది. చూద్దాం.. భవిష్యత్తులో.. ఈ కాంబినేషన్ సెట్టవుతుందేమో?