మెగాస్టార్ః చిరంజీవి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. దేశంలోని రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించింది. గతంలో చిరు పద్మ భూషణ్ అందుకొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయనకు పద్మ విభూషణ్ అందింది. స్వయం కృషితో అంచెలంచెలుగా మెగాస్టార్ స్థాయికి ఎదిగిన ప్రయాణం చిరుది. చిత్రసీమలో ఎలాంటి అండదండలు లేకుండా, తన కష్టంతో, ఒక్కో మెట్టూ ఎదుగుతూ, తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా, చిత్రసీమకు తన ఇంటి నుంచి ఎంతోమంది హీరోల్ని పంపించారు. కేవలం వినోదమే కాదు, సామాజిక సేవలోనూ `నేనున్నా` అంటూ ఆపన్నహస్తం అందించారు చిరు. బ్లాడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ స్థాపించి ఎన్నో ఏళ్లుగా నిర్విరామమైన సేవల్ని అందిస్తున్నారు. కరోనా సమయంలో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ చేసిన సేవలు చిరస్మరణీయం. సీసీసీ స్థాపించి, విరాళాలు సేకరించి, చిత్రసీమలోని కార్మికుల్ని ఆదుకొన్న తీరు… మర్చిపోలేనిది. ఆక్సిజన్ సిలెండర్లు కొరతగా ఉన్న సమయంలో.. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా వేలమందికి ఆక్సిజన్ సిలండర్ల సౌకర్యాన్ని అందించారు. ఎన్నో ప్రాణాల్ని కాపాడారు. 150 సినిమాల్లో నటించి, టాలీవుడ్ స్థాయిని పెంచి, తెలుగు సినిమా వైభవానికి, తానూ ఓ కారణంగా నిలిచిన… మెగాస్టార్ పద్మ విభూషణ్కి అన్ని విధాలా అర్హుడు. అందుకే తెలుగు 360 మెగాస్టార్ చిరంజీవికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అందిస్తోంది.