కరోనా థర్డ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉండడంతో అగ్ర కథానాయకులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. షూటింగులకు రామని చెప్పేశారు. చిరంజీవి కూడా తన చేతిలో సినిమాలన్నీ పక్కన పెట్టేశారు. ఇప్పుడు మళ్లీ ఆయన మేకప్ వేసుకుంటున్నారు. చిరు కథానాయకుడిగా `భోళా శంకర్` రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. మెహర్ రమేష్ దర్శకుడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. శుక్రవారం నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. 12 రోజుల పాటు టాకీ ని తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యూల్ లో చిరుతో పాటుగా, కీర్తి సురేష్, ఇతర నటీనటులు పాల్గొనబోతున్నారు. శుక్రవారం కాఫీ షాప్ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తారు. తమిళ సూపర్ హిట్ చిత్రం వేదాళంకి ఇది రీమేక్. చిరు చెల్లాయిగా కీర్తి నటిస్తోంది. తమన్నా కథానాయిక. ఈ షెడ్యూల్ పూర్తయ్యాక… `గాడ్ ఫాదర్` షూటింగ్ మొదలెట్టబోతున్నారు చిరు. ఫిబ్రవరిలో `గాడ్ ఫాదర్` కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది.