చిరంజీవి ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. వరుసగా సినిమాలపై సినిమాల్ని ఒప్పుకుంటున్నారు. అయితే ఈ సిరీస్ లో ఆయన యువ దర్శకులకే అగ్ర తాంబూలం ఇస్తున్నారు. ఇప్పటికే మోహన్ రాజా, బాబి, మెహర్ రమేష్ కథలకు ఓకే చెప్పారు. ఇప్పుడు మారుతి కథకీ ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. చిరంజీవితో సినిమా చేయాలని మారుతి ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. ఆయన రెండు మూడు కథల్ని కూడా రెడీ చేసుకున్నారు. ఇటీవల చిరుని కలిసి.. ఓ కథ వినిపించినట్టు సమాచారం. దానికి చిరు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశార్ట. మరోవైపు అల్లు అరవింద్ కూడా ఈ కథ విన్నారని, ఆయనకు నచ్చిన తరవాతే.. చిరంజీవి దగ్గరకు పంపారని తెలుస్తోంది. అల్లూ ప్రోత్సాహం కూడా తోడవ్వడంతో ఈ ప్రాజెక్ట్ కి క్లియరెన్స్ వచ్చేసినట్టే. చిరు సెకండ్ ఇన్సింగ్స్లో గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఒక్క సినిమా కూడా చేయలేదు. అప్పుడెప్పుడో.. బోయపాటి శ్రీను – చిరంజీవి కాంబోలో ఓ సినిమా చేయాలని అల్లు అరవింద్ భావించారు. `వినయ విధేయ రామా` ఫ్లాప్ అవ్వడంతో.. చిరు ఆ రిస్క్ తీసుకోలేదు. ఇప్పుడు మాత్రం గీతా ఆర్ట్స్.. మారుతి కాంబోలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి.