తెలుగు చిత్రసీమలో జరుగుతున్న పరిణామాలకు చెక్ పెట్టడానికి టాలీవుడ్ పెద్దలంతా ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఇటీవల వరుసగా అన్నపూర్ణ స్టూడియోలో 24 విభాగాలకు చెందిన కీలకమైన వ్యక్తులతో సమావేశాలు జరిగాయి. ఇవన్నీ చిరంజీవి ఆధ్వర్యంలోనే కొనసాగాయి. శ్రీరెడ్డి వ్యవహారం, కాస్టింగ్‌కౌచ్, మీడియా వ్యవహారాలు ప్రముఖంగా చర్చకు వచ్చాయి. ఇప్పుడు కూడా లోపాయకారిగా కొన్ని రహస్య భేటీలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎవరైతే ఈ విషయంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారో, వాళ్లందరికీ చిరంజీవి ఫోన్లు చేసి ‘ఈ విషయంపై ఇక ఎవ్వరూ మాట్లాడొద్దు’ అని అల్టిమేట్టం జారీ చేశార్ట. టీవీ చర్చావేదికల్లో పాల్గొని, చిన్న విషయాన్ని పెద్దది చేయొద్దని చిరు వార్నింగ్ ఇచ్చాడట. అవసరం ఉన్నా, లేకున్నా మీడియా ముందుకు రావడం తగ్గించాలని.. ఇదే అందరి దృష్టిలో చులకన అవుతుందని, కొన్ని రోజులు ఈ వ్యవహారాలపై ఎవ్వరూ నోరు మెదపకుండా ఉంటే.. పరిస్థితులు వాటంతట అవే చక్కబడతాయని చిరు సలహా ఇచ్చాడట. అందుకే గత నాలుగైదు రోజుల నుంచీ ఎవ్వరూ కాస్టింగ్ కౌచ్ గురించి గానీ, శ్రీరెడ్డి గురించి గానీ, మీడియా గురించి గానీ మాట్లాడడం లేదు.
* టీవీ ఛానళ్ల సంగతేంటి?
కొన్ని వార్త ఛానళ్లని బాయ్ కాట్ చేద్దామన్న చర్చ టాలీవుడ్లో జోరుగా సాగుతోంది. చిరంజీవి మాత్రం దానికి `నో` చెప్పాడట. మీడియాని బాయ్ కాట్ చేయడం అసాధ్యమని, దాని వల్ల తీవ్ర పరిణామాలు సంభవిస్తాయని హెచ్చరించినట్టు సమాచారం. అయితే ఓ ప్రముఖ టీవీ ఛానల్‌పై మాత్రం కాస్త సీరియస్ నిర్ణయమే తీసుకునే అవకాశం ఉంది. ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు సంబంధించి వీడియో అవుట్ కొన్ని టీవీ ఛానళ్లకు అందిస్తుంటారు. ఆ జాబితాలో ఆ వార్తా ఛానల్ కూడా ఉంది. దాన్ని పూర్తిగా పక్కన పెట్టాలని చిత్రబృందం భావిస్తోందని సమాచారం. ఈమధ్య జరిగిన కొన్ని లైవ్ ఈవెంట్ల కవరేజీ ఈ ఛానల్‌కి దక్కలేదు. ఈరోజు జరగబోతున్న ‘నా పేరు సూర్య’ ఆడియో కవరేజీ కూడా ఈ ఛానల్‌కి ఇవ్వలేదని తెలుస్తోంది. మెగా కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాలు, ఇంటర్వ్యూలూ ఈ ఛానల్‌కి ఇవ్వకూడదని చిరంజీవి భావిస్తున్నార్ట. ఇది కుటుంబ పరంగా తీసుకున్న వ్యక్తిగత నిర్ణయమని, పరిశ్రమ నిర్ణయానికీ, దీనికీ సంబంధం లేదని తెలుస్తోంది.