“అన్నయ్య ఇక రాజకీయాల్లోకి రారు.. ఆయన సినిమాలు చేసుకుంటారు..” ఉత్తరాంధ్ర పోరాటయాత్ర చివరి రోజుల్లో… జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇంగ్లిష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో చెప్పిన మాట ఇది. రాజకీయాల నుంచి పూర్తి స్థాయిలో విరమించుకుంటే.. చిరంజీవి చెబుతారు కానీ.. పవన్ కల్యాణ్ చెప్పడమేమిటన్న ప్రశ్న చాలా మందికి వచ్చింది. కానీ ఈ ప్రకటన చేసిన తర్వాతి రోజే… హైదరాబాద్‌లో ఆలిండియా చిరంజీవి ఫ్యాన్స్ మొత్తం జనసేనలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసుకుని మరీ.. పవన్ కల్యాణ్ సమక్షంలో చేరిపోయారు. కొత్తగా వారు చేరాల్సిన పని లేదు.. జనసేన పెట్టినప్పటి నుంచి వారంతా ఆ పార్టీకే పని చేస్తూంటారు. కానీ పని గట్టుకుని… చిరంజీవి ఫ్యాన్స్‌కు కండువాలు కప్పడమంటే.. ఇక చిరంజీవి రాజకీయం లేదు.. అంతా తానే అని చెప్పుకోవడం అన్న ఉహాగానాలు అప్పట్నుంచి వినిపిస్తున్నాయి.
అయితే ఎన్నికల వేడి పెరిగే కొద్దీ… చిరంజీవి పేరు అప్పుడప్పుడూ ప్రచారంలోకి వస్తోంది. కర్ణాటక ఎన్నికలప్పుడు.. ఆయన పేరు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉంది. కానీ చిరంజీవి ప్రచారానికి వెళ్లలేదు. ఇప్పుడు తెలంగాణలో మళ్లీ ఎన్నికల వేడి పెరిగింది. ఏ ఒక్క చిన్న అవకాశాన్ని ఉపయోగించుకోకూడదనుకుంటున్న రాహుల్ గాంధీ… చిరంజీవితో మాట్లాడారు. మళ్లీ యాక్టివ్ కావాలని కోరారు. కానీ చిరంజీవి మాత్రం ఏ సమాధానం నోటితో చెప్పలేదు. హఠాత్తుగా.. తాను కాంగ్రెస్ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోలేదని.. ఇక ఆ పార్టీతో తనకు ఏ సంబంధం లేదన్న లీక్‌ను మాత్రం మీడియాకు వదిలారు. దీన్ని చూసి… కాంగ్రెస్ పార్టీ వర్గాలకు ఓ క్లారిటీ వచ్చినట్లయింది.
2008లో ప్రజారాజ్యం పేరిట పార్టీని స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి.. 2009 ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేశారు. 2014 ఎన్నికల నాటికి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో కొంత కాలం యాక్టివ్‌గా ఉన్నా.. తర్వాత పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. రాజ్యసభకు కూడా హాజరు కాలేదు. లాంగ్ లీవ్ పెట్టి.. తన పదవీ కాలం ముగిసిపోయిందనిపించుకున్నారు. అయితే… వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్.. జనసేనకు ప్రచారం చేస్తారన్న ప్రచారం మాత్రం చిన్న స్థాయిలో జరుగుతోంది. అలా చేయకపోవడానికే ఎక్కువ అవకాశం ఉందని.. తల పండిన రాజకీయ నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే.. ప్రచారం చేస్తే మైనస్ అవుతుందని వారి విశ్లేషణ..!