తన సినిమా విషయంలోనైనా కాస్త ఏమర పాటుగా ఉంటాడేమో గానీ, తనయుడు రామ్ చరణ్ సినిమా విషయంలో ఎప్పటికప్పుడు అప్ డేట్లో ఉంటాడు చిరు. రాజమౌళి చేతికి అప్పగించినా – ఆ సినిమా వ్యవహారాలపై ఓ కన్నేసి ఉంచుతాడు. తాజాగా చిరు `ఆర్.ఆర్.ఆర్` చూసేసినట్టు టాక్. ఈ సినిమాలోని కొన్ని కీలకమైన భాగాలను… చిరు, ఇతర టీమ్ కలిసి ఈమధ్యే చూశార్ట. రషెష్చూసి.. చిరు చాలా పొంగిపోయాడని, రాజమౌళిని పొగడ్తలతో ముంచేశాడని తెలుస్తోంది. `ఈ సినిమా బాహుబలిని మించి పోయింది` అంటూ సన్నిహితుల దగ్గర తన ఆనందాన్ని పంచుకున్నాడట. చిరు చూసింది రషెష్ మాత్రమే. ఫైనల్ మిక్సింగ్, ఆర్.ఆర్ లేకుండా.. చూశాడు. పూర్తి సినిమా చూస్తే.. ఇంకెంత సంతోషపడిపోతాడో..? సాధారణంగా తన సినిమా పూర్తవ్వకముందు రషెష్ వేసి చూపించడం రాజమౌళికి ఇష్టం ఉండదు. టీమ్ కాకుండా.. బయట వాళ్లకు కూడా సినిమా చూపించడు. కానీ.. చిరు విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చాడు. `మగధీర` సమయంలోనూ.. చిరు ఇలానే రషెష్ చూసి `ఈ సినిమా చరిత్ర సృష్టిచండం ఖాయం` అని జోస్యం చెప్పారు. ఇప్పుడు కూడా జోస్యం నిజమవుతుందేమో చూడాలి.