సాధారణంగా సినిమా హిట్టవుతుందా ఫట్టవుతుందా అనేది సినిమా లో పనిచేసిన వాళ్ళకి జనరల్ గా ఒక ఐడియా ఉంటుంది. అయితే కొంతమంది హీరోలు సినిమా మొత్తం షూటింగ్ అయి సెన్సార్ అయ్యాక సినిమా మొత్తం చూసి కూడా సినిమా ఫలితాన్ని గెస్ చేయలేరు. ఉదాహరణకి అప్పట్లో శోభన్ బాబు గానీ, బాలీవుడ్ లో షారుఖ్ కానీ ఏదైనా తమ సినిమా గురించి గొప్పగా చెప్పారంటే అది ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందని ఒక సెటైర్ ఉండేది. అయితే చిరంజీవి విషయం లో ఇది రివర్స్. దాదాపు చాలా సార్లు చిరంజీవి మాటలని బట్టి, సినిమా హిట్టా ఫట్టా అనేది అర్థమవుతూ ఉంటుంది. అప్పట్లో చిరంజీవి సినిమాలు రిలీజ్ అవడానికి ముందు జరిగే ఆడియో ఫంక్షన్స్ ని బాగా గమనిస్తే, సినిమా హిట్టా ఫట్టా అని గనక చిరంజీవి కి ముందే ఒక ఐడియా ఉంటే చిరంజీవి మాటల్లో ఆ విషయం క్లియర్ గా అర్థం అయ్యేది. చిరంజీవి నటించిన సినిమాలకే కాదు, తాను చూసిన సినిమాల విషయం లో కూడా చిరంజీవి ఇచ్చే హింట్స్ కరెక్ట్ గానే వర్కవుట్ అయ్యేవి.
పవన్ కళ్యాణ్ ‘జానీ ‘ సినిమా (2003) రిలీజ్ కి ముందు చిరంజీవి ఒక పేద్ద ఇంటర్వ్యూ ఇచ్చాడు. సినిమా ఎలా వచ్చింది అంటే – “బాగా రాలేదు” అని బయటికి చెప్పలేక – “టెక్నికల్ గా బాగా వచ్చింది” అన్నాడు. ఆ సమాధానం తో తృప్తి చెందని విలేఖరి ఎన్ని సార్లు అదే ప్రశ్న ని ఇటు తిప్పి అటు తిప్పి అడిగినా ఒకటే సమాధానం- “టెక్నికల్ గా చాలా బాగుంది” అని. అర్థం చేసుకోగలిగిన వాళ్ళకి అర్థమయింది రిజల్ట్.
ఆ తర్వాత “అందరివాడు” (2005) అనే సినిమా ఆడియో రిలీజ్ చేసేటపుడు – సినిమా గురించి మాట్లాడకుండా కావాలనే – “గోవింద రాజు క్యారెక్టర్ ని ఎవరూ అనుకరించకండి, ఇది కేవలం పాత్ర రీత్యా ఆ క్యరెక్టర్ ని తాగుబోతు లాగా చూపించాం” గట్రా గట్రా మాట్లాడాడు చిరంజీవి. జై చిరంజీవ (2005) అప్పుడు కూడా – “మంచి వ్యక్తులతో పని చేసిన అనుభూతినిచ్చింది ఈ సినిమా” అంటాడే కానీ మంచి సినిమా తీసారు మా వాళ్ళు అనడు. స్టాలిన్ (2006) అప్పుడయితే…”కమర్షియల్ గా ఎలా ఉంటుందనే విషయాన్ని పక్కన పెడితే మంచి సినిమా తీసామన్న తృప్తి మాకందరికీ ఉంది” అన్నాడు. మూడు సినిమాల ఫలితాలూ తెలిసినవే. ఇంక చిరుత సినిమాకి తెలివి గా ఆడియో ఫంక్షన్ లేకుండా చేసారు. జల్సా సినిమాకి మాత్రం కొంత లో కొంత పాజిటివ్ గా మాట్లాడాడు చిరంజీవి.
మళ్ళీ మగధీర (2009) ఆడియో ఫంక్షన్ లో చిరంజీవి పూర్తి గా పాజిటివ్ గా మాట్లాడాడు. రాజమౌళి ని నంబర్ 1 డైరెక్టర్ అన్నాడు. సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది అన్నట్టు మాట్లాడాడు. ఈ సినిమాకి ముందు పూరీ (2006 పోకిరి తర్వాత) , వినాయక్, రాజమౌళి మధ్య ఈ “నంబర్ 1 డైరెక్టర్” స్థానం దోబూచులాడుతూండేది. ఆ సినిమా ఫలితం తెలిసిందే.
కానీ ఆ తర్వాత మళ్ళీ కొమరం పులి, పంజా లాంటి ఫంక్షన్ లకి హాజరయి, వాటి గురించి పాజిటివ్ గా మాట్లాడే అవసరాన్ని చిరంజీవి బాగానే తప్పించుకున్నాడు. అయితే ఆరంజ్ (2010) సినిమాకి మాత్రం ఆడియో ఫంక్షన్ కి హాజరై కూడాసినిమా గురించి మాట్లాడకుండా – అప్పటి రోశయ్య ప్రభుత్వం “చిరంజీవి బ్లడ్ బ్యాంక్” కి క్లీన్ చిట్ ఇచ్చిన విషయం గురించి మాట్లాడేసి ఆడియో బాగుందని హ్యారిస్ జయరాజ్ ని మెచ్చేసుకుని మమ అనిపించాడు. ఆ సినిమా ఫలితం కూడా తెలిసిందే.
“రచ్చ” (2012) ఫంక్షన్ అప్పుడు చిరంజీవి మళ్ళీ పాజిటివ్ టోన్ లోకి వచ్చాడు. సినిమా కథ ఎక్సలెంట్ అని గానీ సంపత్ నంది కేక అని గానీ అనకుండా..”ఆరంజ్” లో మిస్సయిన కమర్షియల్ అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయనీ, ఆ రకంగా ఇది తప్పకుండా అభిమానుల్ని అలరించే సినిమా అవుతుందనీ అన్నాడు. అన్నట్టుగానే ఆ సినిమా బి,సి సెంటర్లలో బాగా ఆడింది.
గబ్బర్ సింగ్ (2012) ఆడియో ఫంక్షన్ కి వచ్చినపుడు మాత్రం బాగా పొగిడేసాడు..ఖచ్చితంగా ఇది కెవ్వు కేక అనిపించే సూపర్ హిట్ అవుతుందని ఆడియో రోజునే తేల్చేసాడు. దీని ఫలితం తెలిసిందే. ఇక “నాయక్” ఫంక్షన్ కి చిరంజీవి రాలేకపోయినా కానీ, ఆన్ లైన్ లో వచ్చి మరీ మాట్లాడాడు చిరంజీవి. సినిమా లో చరణ్ డ్యాన్సులు ఇరగదీసాడని అన్నాడు. ఫైట్స్, కామెడీ, పెర్ఫార్మెన్స్ అన్నీ బాగా కుదిరాయనీ అన్నాడు. రచ్చ సూపర్ హిట్ అయితే ఇది సూపర్ డూపర్ హిట్ అనీ అన్నాడు. అన్నట్టుగానే నాయక్, రచ్చ మీద కాస్త బెటర్ హిట్ అనిపించుకుంది.
ఈ లెక్కన రంగస్థలం ప్రి-రిలీజ్ ఫంక్షన్ లో కూడా, మీటర్ వేసినట్టు మాట్లాడాడు చిరంజీవి. సినిమా కథలో ఎక్కడికక్కడ అరెస్టింగ్ పాయింట్స్ పెట్టుకుని ఇంటరెస్ట్ సస్టెయిన్ చేస్తూ సుకుమార్ నడిపించాడంటూ సుకుమార్ తీసిన విధానాన్ని ఎంతో మెచ్చుకుంటూ సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని చెబుతూనే, సినిమా హిట్టవడం కంటే ఎక్కువగా చరణ్ పర్ఫార్మెన్స్ గురించి చాలా చాలా గొప్పగా మాట్లాడాడు. ఇంతకంటే ఎక్కువగా మాట్లాడితే బాగోదేమో అని కూడా అభిప్రాయపడ్డాడు. ఇప్పుడు సినిమా ఫలితానికీ, ఆరోజు చిరంజీవి చెప్పిన మాటలకి చాలా చాలా దగ్గరగా ఉండటం తో చిరంజీవి జడ్జ్ మెంట్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందనేది మరోసారి ప్రూవ్ అయింది.
అయితే చిరంజీవి హింట్స్ పూర్తిగా గాడి తప్పిన సందర్భాలూ ఉన్నాయి. వాటిలో ముఖ్యమైం ది – బ్రూస్ లీ. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ లో ఖచ్చితంగా హిట్ అవుతుందని చిరంజీవి అంటే, సినిమా చరణ్ కెరీర్లోనే పెద్ద ఫ్లాప్ గా నిలిచింది. మరి సినిమా చూడకుండా మాట్లాడాడా, చూసే తప్పుదోవ పట్టించాడా లేక తానూ పొరబడ్డాడా అనేది తెలీదు.అలాగే ఆ మధ్య “హలో” సినిమా విషయం లోనూ జరిగింది. ఇలాంటి ఒకట్రెండు సందర్భాలు మినహాయించి మిగత 99% సార్లు చిరంజీవి మాటల్లో (ఆయన సినిమా చూసాక మాట్లాడినప్పుడు) సినిమా హిట్టా ఫట్టా అనే హింట్ మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది.
-జురాన్