హైదరాబాద్: చిరు తనయుడు రాంచరణ్ హీరోగా రూపొందుతున్న బ్రూస్లీ చిత్రం ఆడియో నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి ప్రసంగిస్తూ, హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ గురించి చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. చిత్రానికి పనిచేసినవారిని ఒక్కొక్కరినీ ప్రశంసిస్తూ రకుల్ దగ్గరకు వచ్చేటప్పటికి – తనను తాను మైమరచిపోయారేమో ఏమోగానీ రెచ్చిపోయారు. రకుల్ తన అందచందాలతో సినిమాకు గ్లామర్ తీసుకొచ్చిందని అన్నారు. ప్రత్యేకించి హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ఒక సాంగ్‌ను తాను చూశానని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. అయితే తర్వాతేమన్నారో చూడండి. రకుల్ చాలా Voluptuous(కోరికలు రేకెత్తించేదిగా)గా, సెక్సువల్‌గా, చాలా రొమాంటిక్‌గా, చాలా… చాలా బాగుందని చెప్పారు. రకుల్ ప్రీత్‌సింగ్‌కు ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.
ఒక నిండు సభలో, అందునా వేదికపైన, వేదికముందు – భార్య సురేఖ, చిన్నకూతురు శ్రీజలతో సహా – ఎంతోమంది ఆడవాళ్ళు ఉండగా, మరోవైపు అయ్యప్పమాల వేసుకుని ఉన్న కుమారుడు చరణ్ పక్కన పెట్టుకుని చిరంజీవి అలా మాట్లాడటం విడ్డూరంగా ఉందని చెప్పక తప్పదు. అందునా ఒక బాధ్యతగల పదవి(రాజ్యసభ సభ్యుడు)లో, ఒక జాతీయ పార్టీ నాయకుడుగా ఉంటూ అలా బహిరంగసభలో మాట్లాడటం ఖచ్చితంగా ఆయన స్థాయికి తగినట్లుగా లేదు.