`మా` రాజకీయం రోజురోజుకీ జటిలం అవుతోంది. ఎప్పుడూ లేనంతగా అధ్యక్ష పదవి కోసం రగడ మొదలైంది. అది చాలదన్నట్టు బండ్ల గణేష్ తిరకాసు రాజకీయం ఒకటి… మాలో సెగలు రేపుతోంది. `కంట్రోల్ లో ఉండండి.. మా విషయాలు బయటకు పొక్కనీయడానికి వీల్లేదు` అని చిరంజీవి లాంటి పెద్దలు లోపాయకారిగా చెబుతున్నా, ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రతీ చిన్న విషయాన్నీ రాజకీయం చేయడం, మీడియా ఫోకస్ పడేలా చేసుకోవడం అలవాటైపోయాయి.
ప్రకాష్ రాజ్ వర్గానికి చిరంజీవి మద్దతు ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంలో చిరు ఎప్పుడూ నోరు మెదపలేదు. తెర వెనుక మాత్రం ఆయన చాలా వ్యవహారాల్ని నడిపిస్తున్నారన్నది ఇండ్రస్ట్రీ వర్గాల మాట. అయితే.. `మా` ఎన్నికలలో చిరు వేలు పెట్టకపోవడమే మంచిదని ఆయన సన్నిహితులు అభిప్రాయ పడుతున్నారు. చిరుకి అందరివాడుగా ఇమేజ్ ఉంది. పైగా.. ఇండ్రస్ట్రీకి ఆయన పెద్ద దిక్కుగా మారుతున్నారు. దాసరి తరవాత స్థానంలో కూర్చోవాలనుకుంటున్నారు. ఇలాంటి దశలో ఏదో ఓ వర్గానికి మద్దతు ఇవ్వడం సమంజసం కాదు. పైగా ప్రకాష్‌రాజ్ కి ఓటేయండి అని ఆయన నేరుగా చెప్పరు. చెప్పినా.. `మా`లో ఉన్న రాజకీయాలపై ఆయన మాటలు అంత ప్రభావం చూపించకపోవొచ్చు. ఒకవేళ ప్రకాష్ రాజ్ ఓడిపోతే… ఆ ఓటమి చిరు ఓటమిగా అనుకోవాల్సి వస్తుంది. చిరు అండదండలు లేకుండానే గెలిచాం.. అని మరో వర్గం ప్రచారం చేసుకుంటుంది కూడా. మరి అలాంటప్పుడు అందరివాడుగా, ఇండ్రస్ట్రీ పెద్ద దిక్కుగా… చిరు మాట ఎలా చెల్లుబాటు అయినట్టు?
అందుకే చిరు కూడా ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మా ఎన్నికల విషయంలో తటస్థంగా వ్యవహరించడమే సమంజసం అని ఆయన భావిస్తున్నార్ట. `ఫలానా వాళ్లకు ఓటేయండి.. మద్దతు ఇవ్వండి` అని చిరు మైకు పట్టుకుని చెప్పే అవకాశం ఇక లేనట్టే. లోపాయికారిగానూ… చిరు ఇలాంటి ప్రయత్నాలు ఇక చెయ్యకపోవొచ్చన్నది ఇన్సైడ్ వర్గాల టాక్.