హైదరాబాద్: మొగల్తూరు మొనగాడు చిరంజీవి చాలా రోజుల తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలోని తన సొంత ఊరుకు వెళ్ళారు. సుదీర్ఘకాలం తర్వాత వచ్చిన చిరంజీవికి గ్రామస్థులు బ్రహ్మరథం పట్టారు. రు.50 లక్షల ఎంపీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. అక్కడ నుంచి తాను దత్తత తీసుకున్న పేరుపాలెం సౌత్ గ్రామానికి చిరంజీవి ర్యాలీగా వెళ్ళారు. తన ఎంపీ నిధులనుంచి మంజూరు చేసిన రు.5 కోట్లతో నిర్మించబోయే సీసీ రోడ్లు, వాటర్ ట్యాంక్, కమ్యూనిటీ హాల్ పనులకు శంకుస్థాపన చేశారు. చిరంజీవి వెంట పశ్చిమ గోదావరిజిల్లాకు చెందిన ప్రజారాజ్యం మాజీనేత, ప్రస్తుత వైసీపీ నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు ఉండటం విశేషం. మరోవైపు మెగాస్టార్ భుజానికి స్లింగ్ బ్యాగ్ తగిలించుకునే ఉన్నారు. ఇటీవల ఆయనకు ముంబాయిలో భుజానికి ఆపరేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్న చిరంజీవి కేంద్ర ప్రభుత్వ సంసద్ ఆదర్శ గ్రామ్ యోజన పథకం కింద పేరుపాలెం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.