చిరు జోరు మామూలుగా లేదు. ఆచార్య, లూసీఫర్ – వేదాళం రీమేక్‌లు, బాబీ సినిమా… ఇలా మహా స్పీడుగా వుంది వ్యవహారం. ఇటీవల మారుతి చెప్పిన కథకు కూడా చిరు ఓకే చెప్పాడని, త్వరలోనే ఈ కాంబినేషన్ లో ఓ సినిమా రావొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు లేటెస్టుగా ప్రభుదేవా పేరు కూడా వినిపించడం మొదలైంది. డాన్సర్ నుంచి హీరోగా మారి, ఆ తరవాత దర్శకుడిగా మారిన వైనం ప్రభుదేవాది. బాలీవుడ్ లో తనకు సూపర్ హిట్లున్నాయి. తెలుగులో చిరుతో `శంకర్ దాదా జిందాబాద్` చేశాడు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయినా సరే, ఇప్పుడు ప్రభుదేవాకు మరో అవకాశం ఇవ్వడానికి చిరు రెడీగా ఉన్నాడని భోగట్టా.
రీమేక్‌లు బాగా తీస్తాడని ప్రభుదేవాకు పేరుంది. అందుకే.. ప్రభుదేవాకు చిరు మరో రీమేక్ అప్పగించే పనిలో ఉన్నాడని టాక్. అయితే ఆ రీమేక్ ఏమిటి? ఏ భాషలోనిది? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి. ప్రభుదేవాతో చిరుకి మంచి అనుబంధం ఉంది. చిరు సూపర్ హిట్ గీతాల వెనుక… ప్రభుదేవా కష్టం ఉంది. చిరుకి నటించిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించాడు ప్రభుదేవా. ఆ అనుబంధంతోనే.. చిరు ప్రభుదేవాకు మరో ఛాన్స్ ఇస్తున్నాడని సమాచారం. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.