చిరంజీవి ఆకర్షించేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. భీమవరంలో జరగనున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకలకు చిరంజీవి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారికంగా ఆహ్వానించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రధానమంత్రి మోదీ భీమవరంలో అల్లూరి సీతారారారాజు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు. వచ్చే నెల నాలుగో తేదీన ఈ కార్యక్రమం జరగనుంది. ఇందులో పాల్గొనాలని… చిరంజీవిని కిషన్ రెడ్డి ఆహ్వానించారు.
నిజానికి ఈ కార్యక్రమానికి చిరంజీవిని ప్రత్యేకంగా పిలవాల్సిన అవసరం లేదు. కానీ ప్రధాని మోదీ పాల్గొనే పర్యటన కావడం.. జన సమీకరణ భారీగా చేసే పరిస్థితులు ఏపీ బీజేపీ నేతలకు లేకపోవడంతో చిరంజీవిని ఆహ్వానిస్తే పని సులువు అవుతుందన్న అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఏపీలో బీజేపీ బలపడాలంటే.. ఓ ప్రజాకర్షక నేత అవసరం. గతంలో చిరంజీవితో చర్చలు జరిపారని.. బీజేపీలో చేరుతారని కొన్ని పుకార్లను కూడా పుట్టించారు. కానీ అప్పట్లో చిరంజీవి టెంప్ట్ కాలేదు.
తమిళనాడులో కూడా బీజేపీ ఇలాంటి ఎత్తులే వేసింది. రజనీకాంత్‌తో పరిచయాలు పెంచుకునేందుకు ప్రయత్నించింది. మోదీ, అమిత్ షా కూడా స్వయంగా రజనీకాంత్‌ను కలిశారు. పలు కార్యక్రమాలకు ఆహ్వానించారు. అయితే రజనీ మాత్రం సొంత పార్టీ వైపు మొగ్గారు. కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో చివరి క్షణంలో విత్ డ్రా చేసుకున్నారు. ఏపీలో అదే వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తోంది. ప్రధాని మోదీ పాల్గొనే కార్యక్రమానికి కిషన్ రెడ్డి ఆహ్వానం పంపితే రాలేను అనే పరిస్థితి చిరంజీవికి లేదు. ఆయనకే కాదు ఎవరికీ ఉండదు. ఎందుకంటే.. అలా తిరస్కరిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కథలు కథలుగా చెప్పుకుంటారు. అందుకే చిరంజీవి ఖచ్చితంగా ఆహ్వానాన్ని అంగీకరిస్తారు. ఆ తర్వాత బీజేపీ చేసే రాజకీయాన్ని ఆయన మౌనంగా చూడాలి.