‘ఆచార్య’లో మహేష్ బాబు ఎపిసోడ్ లో ఓ క్లారిటీ అయితే వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు లేడు. ఆ పాత్ర రామ్ చరణ్ చేస్తున్నాడు. అయితే.. మహేష్ విషయంలో చిరంజీవి చెప్పిన వెర్షన్‌కీ, కొరటాల శివ చెప్పిన వెర్షన్‌కీ చాలా తేడా వుంది.
‘ఆచార్య’లో మహేష్ నటిస్తున్నాడన్న వార్తలు రావడం, రోజుకి కోటి చొప్పున 30 రోజులకు, 30 కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడన్న సంగతి మీడియాకు లీకైంది. అయితే.. ఆ తరవాత మహేష్ తప్పుకున్నాడు. ఇదే విషయమై చిరుని ఓ ఇంటర్వ్యూలో అడిగితే.. ‘అసలు ఈ వార్త ఎలా పుట్టిందో తెలీదు.. అసలు మహేష్ మా చర్చల్లోకి రాలేదు’ అని చెప్పేశాడు. స్వయంగా చిరంజీవే క్లారిటీ ఇచ్చాడు కాబట్టి.. మహేష్ ది కేవలం పుకారే అని సరిపెట్టుకున్నారు ఫ్యాన్స్.
ఈ రోజు ఓ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొరటాల శివ మరో వెర్షన్ చెప్పుకొచ్చాడు. ఈ కథలో రామ్ చరణ్ చేయాల్సిన పాత్ర ఒకటుందని, అయితే ఆర్.ఆర్.ఆర్ ఆలస్యం వల్ల చరణ్ తమ టీమ్ లో జాయిన్ అవ్వడం కుదరదేమో అని భయపడుతున్న తరుణంలో సమస్యని అర్థం చేసుకున్న మహేష్ స్వయంగా… ‘నేనున్నాను.. భయపడకండి’ అంటూ కొరటాలకు అభయం ఇచ్చాడని… స్వయంగా కొరటాలే చెప్పాడు. కనీసం పాత్ర ఏమిటన్నది కూడా ఆలోచించకుండా.. ‘నేను నటిస్తా’ అని మహేష్ మాట ఇవ్వడం గొప్ప విషయమని, ఇది తనకూ మహేష్‌కీ జరిగిన అందమైన ఎపిసోడ్ అని, అయితే మీడియా దాన్ని మరీ పెద్దది చేసి రాసేసిందని క్లారిటీ ఇచ్చాడు కొరటాల. అంటే ఈ పాత్ర గురించి మహేష్ కి తెలుసు. చరణ్ స్థానంలో మహేష్‌ని తీసుకోవాలా, వద్దా అనే విషయంలో భారీ ఎత్తున చర్చ జరిగిన మాటా నిజమే. కానీ… మళ్లీ నిర్ణయాలు మారిపోయాయి. మహేష్ లైట్ తీసుకున్నాడు. తెర వెనుక ఇంత తతంగం జరిగితే.. ‘మహేష్ పేరు ఎలా వచ్చిందబ్బా’ అని చిరు ఆశ్చర్యపోవడం నిజంగా పెద్ద ఆశ్చర్యమే.