చిరంజీవి తరపున ఏపీ మంత్రి పేర్ని నాని ప్రకటనలు చేయడం ఆపడం లేదు. గతంలో ఆన్ లైన్ టిక్కెట్లు అమ్మాలని చిరంజీవే కోరానని ఆయన ప్రకటించారు. అయితే చిరంజీవి ఈ అంశంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా చిరంజీవి తరపున పేర్ని నాని మరో ప్రకటన చేశారు. రిపబ్లిక్ సినిమా ఫంక్షన్లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి తనతో మాట్లాడారని.. ఆయన విచారం వ్యక్తం చేశారని పేర్ని నాని ప్రకటించుకుంటున్నారు. పవన్ వ్యాఖ్యలతో ఏకీభవించడం లేదని చిరంజీవి చెప్పారన్నారు. సినిమా నిర్మాతలతో మచిలీపట్నంలో సమావేశం అయిపోయిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
సినిమా ఫంక్షన్లో పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలతో తమకు సంబంధం లేదని చెప్పడానికే నిర్మాతలు వచ్చారని పేర్ని నానిచెప్పుకున్నారు. ఆన్ లైన్ టిక్కెటింగ్ కొత్తదికాదని ఆ విధానానికి సినీ పరిశ్రమ అనుకూలంగా ఉందన్నారు. టాలీవుడ్ సమస్యలపై సీఎం సానుకూలంగా ఉన్నారన్నారు. పవన్ కల్యాణ్ కిరాయి పార్టీని నడుపుతున్నారని మండిపడ్డారు. కిరాయికి పని చేసేదెవరో అందరికీ తెలుసన్నారు. రాజకీయ పార్టీని టెంట్ హౌస్గా అద్దెకిస్తూంటారని ఆరోపించారు. అయితే మీడియాతో మాట్లాడిన నిర్మాత దిల్ రాజు మాత్రం బ్యాలెన్సుడ్గా స్పందించారు. సినీ పరిశ్రమ సున్నితమైనదని.. వివాదాల్లోకి లాగవద్దని కోరారు. సినిమా టిక్కెట్ల రేట్లు పెంచాలని కోరామని.. గత సమావేశంలోనూ కోరామన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు.
పవన్ కల్యాణ్ ఓ వైపు మంగళగిరిలో పార్టీ సమావేశం పెట్టి ప్రభుత్వం, వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్న సమయంలోనే వ్యూహాత్మకంగా నిర్మాతల్ని మంత్రి పిలిపించుకున్నట్లుగా భావిస్తున్నారు. పవన్ సమావేశం జరుగుతున్న సమయంలో చిరంజీవి పేరుతో పేర్ని నాని ప్రకటన చేయడం … సినీ పరిశ్రమ పవన్ వైపు లేదని చెప్పడానికి ప్రయత్నించడం వ్యూహం ప్రకారం చేస్తున్నారని భావిస్తున్నారు.