బ్రహ్మానందంలో హాస్య చతురత ఎక్కువ. అందుకే ఆయన హాస్య నటుడయ్యాడు. దశాబ్దాలుగా నవ్వుల్ని పంచుతూనే ఉన్నాడు. సినిమాల్లోకి రాకముందు తెలుగు అధ్యాపకుడు. పాఠాలు చెబుతూనే మిమిక్రీ చేస్తుండేవారు. జోకులు చెప్పి అందరినీ నవ్విస్తుండేవారు. అలాంటి బ్రహ్మానందానికి చిరంజీవి ముందు నిలబడి… ఎంటర్టైన్ చేయాల్సిన సందర్భం వచ్చింది. ఆ పక్కనే జంథ్యాల కూడా ఉన్నారు. ఆ సమయంలో.. చిరుకి చెప్పిన జోక్ గురించి `నేను.. మీ బ్రహ్మానందమ్` ఆత్మ కథలో రాసుకొన్నారు బ్రహ్మీ.
”ఓ ఊళ్లో ఒక పిచ్చోడున్నాడు. ఆ ఊరికో ప్రిసిడెంట్ ఉన్నాడు. ఆ ప్రెసిడెంట్ ఊరికి ఎవరైనా కొత్తవాళ్లొస్తే, పిచ్చోడి గురించి చెప్పి… ‘వీడొక పిచ్చివాడు. ఎంత ముదురు పిచ్చివాడంటే… మీరే చూడండి’ అని ఆ పిచ్చివాడి ముందు పది నోటు, ఐదు నోటు, రెండు రూపాయల నోటు, రూపాయి నోటు పెట్టి ‘నీకు నచ్చింది తీసుకోరా’ అనేవాడు. ఆ పిచ్చివాడు వాటిల్లోంచి ఒక్క రూపాయి నోటు మాత్రమే తీసుకుని పరుగెత్తేవాడు. అలా ఊరొచ్చిన ప్రతివాడికీ పిచ్చివాడి గురించి చెప్పడం, వాడి ముందు నోట్లు పెట్టడం, వాడు రూపాయి మాత్రమే తీసుకుని పరుగెత్తడం జరుగుతూ ఉండేది. ఒకరోజు ఒక వ్యక్తి వాడిని పట్టుకుని ‘ఒరేయ్… అన్ని నోట్లు ముందు పెడితే పది రూపాయలు తీసుకోకుండా ఎప్పుడూ ఒక్క రూపాయే తీసుకుంటావేమిట్రా’ అని అడిగాడు. అందుకు పిచ్చివాడు ఒక పిచ్చి నవ్వు నవ్వి… ‘ఒకవేళ నేను పది రూపాయలు తీసుకుని ఉంటే ఆయన ఆ పదితోనే ఇవ్వడం ఆపేసుండేవాడు. ఒక్క రూపాయి తీసుకున్నాను గనకనే ఇప్పటికీ ఓ ముప్పయ్ నలభై మందికి చెప్పాడాయన’ అని చెప్పాడు. అడిగిన వ్యక్తి నోరు తెరిచాడు”. ఈ జోక్ చెప్పగానే చిరంజీవి, జంథ్యాల పగలబడి నవ్వారట. అప్పటి నుంచీ.. బ్రహ్మానందంపై చిరుకి మంచి గురి కుదిరింది. ఆ తరవాత తన సినిమాల్లో అవకాశాలు ఇచ్చి, ప్రోత్సహించారు. అయితే ఇదే జోక్.. ఇటీవల వచ్చిన ‘కుమారి శ్రీమతి’ వెబ్ సిరీస్లో మరోలా వాడుకొన్నారు. ఆ ఎపిసోడ్ కూడా బాగా పేలింది.