ఉప రాష్ట్రపతి అభ్యర్థి కావడంతో క్రియాశీల రాజకీయాలకు వెంకయ్య నాయుడు దూరం అవుతున్న సంగతి తెలిసిందే. ఆయన స్థానాన్ని పార్టీలో భర్తీ చేయగలిగేవారి కోసం భాజపా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవివైపు భాజపా చూస్తోందని తెలుస్తోంది. నిజానికి, జనసేన పేరుతో పవన్ కల్యాణ్ రాజకీయంగా కాస్త క్రియాశీలంగా మారే సమయానికే.. చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. దీంతో పాలిటిక్స్ కు మెగాస్టార్ దూరం కాబోతున్నట్టుగానే అనిపించింది. పేరుకు మాత్రమే ఆయన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నారని అనొచ్చు! ఆంధ్రా ఆ పార్టీ తరఫున కీలక సమయాల్లో బలంగా నిలిచిందీ లేదు, సుప్తచేతనావస్థలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు ఇచ్చే బాధ్యతనూ ఆయన తీసుకునే మూడ్ లో ఏనాడూ లేరు. రాజకీయంగా ప్రస్తుతం చిరంజీవి పరిస్థితి ఏంటంటే.. తటస్థం. అందుకే, ఆయన్ని భాజపాలోకి ఆహ్వానిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
వెంకయ్య నాయుడు భాజపాకి దూరమైన తరువాత ఆంధ్రప్రదేశ్ లో భాజపా వ్యవహారాలను ఆ పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్ సమీక్షిస్తున్నారు. చిరంజీవితో ఆయనే మంతనాలు జరిపినట్టు చెబుతున్నారు. ఆంధ్రాలో భాజపా సోలోగా ఎదిగేందుకు వ్యూహరచనలో భాగంగానే మెగాస్టార్ రంగంలోకి దించాలని అనుకుంటున్నారట. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో భాజపా దోస్తీ అనుమానమే అనే సంకేతాలు ఈ మధ్య వ్యక్తమౌతున్నాయి. ఏపీలో విపక్షం వైసీపీతో ఈ మధ్య భాజపా వ్యవహరిస్తున్న తీరే ఇందుకు సాక్ష్యం. రాష్ట్రంలో భాజపా సొంతంగా ఎదగాలంటే… ఒక స్టార్ కేంపెయినర్ కావాల్సిందే. తెలుగుదేశంతో పొత్తు లేకపోయినా.. చిరంజీవి లాంటి క్రౌడ్ పుల్లర్ పార్టీలో ఉంటే భాజపాకి కచ్చితంగా ప్లస్ అవుతుంది. సామాజిక వర్గ సమీకరణాల ప్రకారం చూసుకున్నా.. ఏపీలో కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించాల్సిన అవసరం అన్ని పార్టీలకూ ఉంది. ఆరకంగా చూసుకున్నా చిరంజీవి చేరికతో భాజపాకి చాలా మేలు జరుగుతుందని చెప్పొచ్చు. ఇవన్నీ లెక్కలేసుకున్నాకనే చిరంజీవివైపు భాజపా చూపు పడిందని అంటున్నారు.
అయితే, చిరంజీవి రాజకీయ పార్టీ మార్పుపై గతంలో కూడా చాలాసార్లు చర్చనీయాంశం అయింది. ఆయా సందర్భాల్లో మెగాస్టార్ స్పందించి… తాను కాంగ్రెస్ పార్టీతోనే ఉంటానని స్పష్టం చేశారు. మరి, ఇప్పుడెలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో… మెగాస్టార్ ను భాజపాలోకి తీసుకుని రాగలిగితే కచ్చితంగా కీలక పరిణామమే అవుతుంది. ఏపీ విషయంలో భాజపా తీసుకోబోయే నిర్ణయం ఏదైనాసరే, అది టీడీపీకి పెద్ద సవాల్ గా మారబోతోందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.