సైరా షూటింగ్ అర్థాంతరంగా ఆగిపోవడం మెగా అభిమానుల్ని నిరాశలోనూ, గందరగోళంలోనూ పడేసింది. ఈ సినిమా కోసం చిరు కాస్త సన్నబడాలని, అందుకు తగిన కసరత్తులు చేస్తున్నారని, దాని కోసమే సైరా షూటింగ్ ఆలస్యం అవుతోందని చిత్రబృందం చెబుతూ వస్తోంది. అయితే.. `తొలి ప్రేమ` అభినందన కార్యక్రమంలో చిరంజీవి ఎప్పట్లా లావుగానే కనిపించడం అభిమానుల్ని మరోసారి ఆశ్చర్యపరిచింది. ఈ గ్యాప్‌లో చిరు సన్నబడిందేం లేదు. పైపెచ్చు ఇంకాస్త బొద్దుగా మారాడు. దాంతో.. `సైరా`కి గ్యాప్ ఎందుకిచ్చారబ్బా?? అనే ప్రశ్న మరోసారి తలెత్తింది. సైరా పాత్ర కోసం సన్నబడి తీరతా అని చిరంజీవే ముందుకు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల భోగట్టా. నిజానికి బొద్దుగా ఉన్నవారిని కూడా స్లిమ్‌గా చూపించే టెక్నాలజీ తెలుగు చిత్రసీమకు అందుబాటులో ఉంది. తద్వారా కష్టపడకుండానే స్లిమ్ అయిపోవొచ్చు. అయినా సరే, చిరు కసరత్తులకు దిగేసరికి.. మంచి అవుట్ పుట్ వస్తుందనుకున్నారు. కానీ ఇప్పుడు చిరంజీవిని చూస్తుంటే కసరత్తులు చేయడానికి కాస్త బద్దకిస్తున్నట్టే అనిపిస్తోంది. ఇప్పుడు యధావిధిగా చిరుని స్లిమ్ చేయడానికి కెమెరా ట్రిక్కుల్ని నమ్ముకోవాల్సిందే.