ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును మెగాస్టార్ చిరంజీవి కలిశారు. ఏపీలో వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి తన తరపున రూ.50 లక్షలు, హీరో రామ్ చరణ్ తరపున రూ.50 లక్షల విరాళం అందించారు. చెక్కులు ఇచ్చేందుకు చిరంజీవి చంద్రబాబు ఇంటికి వచ్చారు. చిరంజీవిని ఇంటి గుమ్మం వరకూ వెళ్లి ఇంట్లోకి సాదరంగా స్వాగతం పలికారు. మళ్లీ వెళ్లేటప్పుడు కారు వరకూ వెళ్లి వీడ్కోలు పలికారు. దసరా రోజున వీరి భేటీ హైలెట్ అయింది. దీనికి కారణం రూ. కోటి కాదు .. చంద్రబాబు, చిరంజీవి మధ్య బాండింగ్.
గతంలో చిరంజీవితో జగన్ ఎలా వ్యవహరించారు..ఇప్పుడు చంద్రబాబు ఎలా వ్యవహరిస్తున్నారన్నదే కంపేరిజన్. నిజానికి జగన్ చిరంజీవితో మొదటి సారి భేటీ అయినప్పుడు గౌరవంగానే వ్యవహరించారు. ఆయనను ఇంట్లోకి ఆహ్వానించి భోజనం కూడా ఆఫర్ చేశారు. స్వయంగా భారతీనే వడ్డించారు. కానీ చిరంజీవి జగన్ పొలిటికల్ ట్రాప్లో పడకపోవడంతో మరోసారి ఆయనను ఫిల్మ్ ఇండస్ట్రీ సమస్యల పేరుతో పిలించుకుని చేతులు జోడించుకుని బతిమాలుకునేలా చేసుకున్నారు. ఆ వీడియోలు బయటకు విడుదల చేసి వికృత మానసిక ఆనందం పొందారు.
కానీ చిరంజీవి విషయంలో చంద్రబాబు మొదటి నుంచి ఒకే రకమైన గౌరవమర్యాదలు చూపించేవారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టుకున్న తర్వాత కూడా ఎప్పుడూ చిరంజీవిని తక్కువ చేయలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినా అందరూ నానా మాటలన్నారు కానీ చంద్రబాబు విమర్శలు చేయలేదు.ఇద్దరి మధ్య మొదటి నుంచి ఉన్న బాండింగ్ రాజకీయాలు దెబ్బతీయలేదని దసరా రోజున మరోసారి ఇద్దరూ నిరూపించారు.