సైరా లాంటి సినిమాలు మరిన్ని చేయాలని చిరంజీవికి జగన్మోహన్ రెడ్డి సూచించారు. మరింత కాలం టాలీవుడ్ లో మెగాస్టార్ గా ఉండాలని ఆకాంక్షించారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో గంట పాటు జరిగిన విందు భేటీ రాజకీయాలకు అతీతంగా జరిగిందని చిరంజీవి ప్రకటించారు. తన కొత్త సినిమా సైరా నరసింహారెడ్డిని చూడాలని ఆహ్వానించేందుకు చిరంజీవి సతీ సమేతంగా జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లారు. లంచ్ టైంలో సమావేశం ఏర్పాటు చేయడంతో… చిరంజీవి దంపతులకు జగన్ విందు ఇచ్చారు. ఆ సమయంలో గంట పాటు వీరి మధ్య చర్చ జరిగింది. అయితే.. రాజకీయాలపై చర్చలేమీ జరగలేదని.. సైరా నరసింహారెడ్డి సినిమా, టాలీవుడ్ పైనే ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. సైరా నర్సింహారెడ్డి సినిమాను చాలా బాగా తీశారని విన్నానని జగన్ .. చిరంజీవిని అభినందించారు. ఆ సమయంలో సైరా విశేషాలను చిరంజీవి జగన్ కు వివరించారు.
జగన్ సమయం కేటాయిస్తే.. ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేస్తామని చిరంజీవి చెప్పారు. జగన్ ఎప్పుడు సైరా నరిసంహారెడ్డిని చూస్తారన్నదానిపై క్లారిటీ రాలేదు. సహజంగా జగన్మోహన్ రెడ్డికి సినిమాలపై ప్రత్యేక ఆసక్తి ఉందని చెబుతారు. ఎన్నికల హడావుడిలోనూ ఆయన అవెంజర్స్ సినిమాకు వెళ్లారు. అంతకు ముందు సతీసమేతంగా ఇంటికి రావడంతో.. భార్య భారతితో కలిసి సాదరంగా ఆహ్వానించారు. చిరంజీవి జగన్మోహన్ రెడ్డిని శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందించారు. చిరంజీవితో జగన్ భేటీ పదకొండో తేదీనే జరగాల్సి ఉన్నప్పటికి వాయిదా పడింది. చిరంజీవి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డితో భేటీ కావడం రాజకీయవర్గాల్లోనూ ఆసక్తి రేపింది. అయితే.. అలాంటి చర్చలకు అవకాశం లేదని తెలుస్తోంది.
జగన్మోహన్ రెడ్డి మీరు మరిన్ని సినిమాలు చేయాలని చిరంజీవితో అన్నారు. అంటే.. పరోక్షంగా చిరంజీవి ఇక రాజకీయాలవైపు చూడవద్దని సలహా ఇచ్చారన్న అభిప్రాయం ఏర్పడుతోంది. చిరంజీవి కూడా ఇటీవలి కాలంలో రాజకీయాల ఆలోచన చేయడం లేదు. పూర్తి స్థాయిలో సినిమాలపైనే దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటికే ఓ సినిమాకు క్లాప్ కొట్టి.. మరో రెండు, మూడు సినిమాలను లైన్ లో పెట్టారు. అంతకు ముందు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో చిరంజీవి గన్నవరం వచ్చారు. విమానాశ్రయం నుంచి నేరుగా తమ్ముడు పవన్ కల్యాణ్ ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత జగన్ ఇంటికి వెళ్లారు.