హైదరాబాద్: ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభానికి సంఘీభావం తెలిపేందుకు నటుడు, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవి రేపు కిర్లంపూడి వెళుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ముద్రగడ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాపు కులానికి చెందన చిరంజీవి కూడా ముద్రగడకు మద్దతు ప్రకటించటానికి కిర్లంపూడి వెళుతున్నట్లు కనబడుతోంది. అక్కడ రేపు ఆయన మీడియాతో కూడా మాట్లాడే అవకాశాలున్నాయి. 150వ సినిమా కోసం ఇటీవల ముంబాయి బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఆపరేషన్ చేయించుకున్న చిరంజీవి ఇప్పుడే కోలుకుంటున్నారు. ముంబాయినుంచి రాగానే కిర్లంపూడి వెళతారని తెలుస్తోంది. రేపు 11.30 గంటలకు రాజమండ్రి వెళతారని, అక్కడనుంచి రోడ్డు మార్గంలో కిర్లంపూడి చేరుకుంటారని సమాచారం. పీసీసీ అధ్యక్షుడు రఘువీరా కూడా ఆయన వెంట వెళతారని తెలుస్తోంది. అటు దర్శకుడు దాసరి నారాయణరావు కూడా రేపు కిర్లంపూడి వెళతారని చెబుతున్నారు.
మరోవైపు చంద్రబాబు ఆస్తులపై ముద్రగడ చేసిన వ్యాఖ్యలను హోమ్ మంత్రి చినరాజప్ప ఖండించారు. చంద్రబాబు ప్రతిఏడూ తన ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్నారని గుర్తు చేశారు. అనవసర ఆరోపణలు తగదని అన్నారు. మంజునాథ కమిషన్ వేసి చంద్రబాబు కాపులకు రిజర్వేషన్ పట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారని చెప్పారు. ముద్రగడ దీక్షను విరమించాలని అన్నారు. అటు తూర్పు గోదావరిజిల్లా పి.గన్నవరంలో ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాపులు చినరాజప్ప ఫ్లెక్సీలను, టీడీపీ ఫ్లెక్సీలను చించేశారు. పోలీస్ స్టేషన్ను ముట్టడించారు.