2009 సార్వత్రిక ఎన్నికలకు ముందు చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఆయన ఇద్దరు సోదరులు నాగబాబు, పవన్ కళ్యాణ్ ఆయనకు అండగా నిలిచి ప్రచారం చేసారు కానీ ఫలితం లేకపోవడంతో ప్రజా రాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు చిరంజీవి. కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కారణంగానే పవన్ కళ్యాణ్ అన్నయ్యకు మద్దతు ఇస్తే ఆయన మళ్ళీ అదే కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో ఆయనకు దూరం అయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించడంతో వారి మధ్య దూరం ఇంకా పెరిగింది. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చిరంజీవి, దానిని ఓడించాలని పవన్ కళ్యాణ్ గట్టిగా ప్రయత్నించడంతో వారిరువురూ రాజకీయ శత్రువులుగా మారిపోయారు. 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోవడంతో దానితోబాటే చిరంజీవి రాజకీయ జీవితం కూడా తారుమారయ్యింది. ఆ తరువాత ఆయన మళ్ళీ సినీ పరిశ్రమకి వచ్చి ‘కత్తి’ పట్టుకోవడం అందరికీ తెలిసిందే. రాజకీయాలకు, కాంగ్రెస్ పార్టీకి దూరం అయిన తరువాత చిరంజీవి మళ్ళీ పవన్ కళ్యాణ్ కి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నట్లున్నారు. ఇవ్వాళ్ళ ఆయన హైదరాబాద్ లో గబ్బర్ సింగ్ సినిమా షూటింగ్ స్పాట్ కి వెళ్లి తమ్ముడు పవన్ కళ్యాణ్, చిత్ర యూనిట్ సభ్యులతో కాసేపు ముచ్చటించారు.