వెబ్ సిరీస్ చరిత్రలోనే.. ‘ఫ్యామిలీమెన్’ ఓ మైల్ స్టోన్‌గా నిలిచిపోతుంది. కథనం, ఆ కథని చెప్పిన విధానం అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయి. దర్శకులుగా రాజ్ డికేకి ఈ వెబ్ సిరీస్ అత్యంత గుర్తింపు తీసుకొచ్చింది. పార్ట్ 2లో సమంత చేరికతో ఈ వెబ్ సిరీస్ కి మరింత మైలేజీ వచ్చింది.
ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ వెనుక ఆకసక్తికరమైన విషయాన్ని అశ్వనీదత్ బయట పెట్టారు. నిజానికి ఇదో సినిమాగా రావాల్సిన కథ. పైగా తొలుత చెప్పింది మెగాస్టార్ చిరంజీవికే. చిరుత తరవాత… చిరుతో ఓ సినిమా చేయాలని అశ్వనీదత్ ఫిక్సవ్వడం, రాజ్ డీకేలను వెంటబెట్టుకొని వెళ్లడం, వాళ్లేమో.. ది ఫ్యామిలీ మెన్ కథ చెప్పడం ఇవన్నీ ఫ్లాష్ బ్యాక్ వ్యవహారాలు. చిరు ఈ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించారు. ఇద్దరు పిల్లలకు తండ్రిగా నటించడమే చిరు అభ్యంతరం.
చిరు గనుక ఈ కథ ఒప్పుకొంటే ఎక్కడో ఉండేదన్నది అశ్వనీదత్ ఫీలింగ్. చిరుని అమితంగా ఇష్టపడే నిర్మాతగా, ఆ ప్రేమ కొద్దీ అశ్వనీదత్ ఈ మాట అని ఉండొచ్చు. కానీ.. చిరు ‘నో’ చెప్పడమే కరెక్ట్. ఎందుకంటే.. చిరుత అంటే దాదాపుగా 16 ఏళ్ల క్రితం నాటి మాట. అప్పటికి ఇంకా చిరు మాస్, కమర్షియల్ కథలవైపే మొగ్గు చూపిస్తున్న దశ. ఆ టైమ్‌లో చిరు ఇంత పెద్ద రిస్క్ తీసుకోలేడు. పైగా.. ‘ది ఫ్యామిలీ మెన్’ కథని వెబ్ సిరీస్‌గా చూసినంత మాత్రాన సినిమాగా పనికొస్తుందన్న రూలేం లేదు. ఇప్పుడంటే వెబ్ సిరీస్‌లకు అలవాటు పడి, ఆ తీత, ఆ తరహా రాతని ఎంజాయ్ చేస్తున్నారు. పదహారేళ్ల క్రిందట ఇది ఊహించలేని విషయమే. ఒకవేళ వెబ్ సిరీస్‌గానైనా చిరు చేసి ఉంటే.. ‘ఫ్యామిలీమెన్ని’ ప్రేక్షకులు చూసే కోణమే వేరుగా ఉండేది. ఇంతటి అప్లాజ్ చిరు చేసినా వచ్చేదా అనేది డౌటే. సో.. ఓరకంగా చిరంజీవి ఈ కథని ఒప్పుకోకపోవడమే మంచిది అయ్యిందేమో..?