అమీర్ ఖాన్ నటించిన `లాల్ సింగ్ చద్దా`కి తెలుగులో సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు చిరంజీవి. చిరు సమర్పణలో ఓ సినిమా రూపుదిద్దుకోవడం ఇదే తొలిసారి. ఈ సినిమా ప్రమోషన్లలోనూ చిరు గట్టిగానే పాల్గొంటున్నాడు. చిరు, అమీర్, నాగచైతన్యలతో నాగ్ ఓ స్పెషల్ వీడియో ఇంటర్వ్యూ కూడా చేశాడు. ఈ సందర్భంగా.. చిరుతో ఓ సినిమా చేయాలని ఉందని అమీర్ ఖాన్ తన మనసులో మాట బయటపెట్టాడు. దాంతో వెంటనే ఎగ్జైట్ అయిన చిరు.. ఓ కండీషన్ కూడా పెట్టాడు. “అన్నీ ఫస్ట్ టేక్‌లోనే ఓకే చేస్తాను అంటేనే..“ అంటూ. అమీర్‌ని మిస్టర్ పర్ఫెక్ట్ అని పిలుస్తారు. తనకు కావల్సినట్టు సీన్ వచ్చేంత వరకూ టేకుల మీద టేకులు తీస్తూనే ఉంటారు. అందుకే చిరు.. ఈ క్లాజ్ ఉదహరించాడు. దానికి నాగ్ స్పందిస్తూ…`దర్శకత్వం వద్దు.. మీరు నిర్మాతగా ఉంటేనే బెటరేమో..` అని సర్ది చెప్పాడు. సినీ ప్రమోషన్లలో ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం మామూలే. కానీ అమీర్ ఖాన్ కేవలం స్టేట్మెంట్ల కోసం మాట్లాడే వ్యక్తి కాదు. తను అన్నాడంటే ఎంతో కొంత సీరియస్‌నెస్ ఉంటుంది. ఒకవేళ చిరుతో నేరుగా సినిమా చేయకపోయినా.. చిరు నటించిన ఓ సినిమాని బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ప్రమోట్ చేయొచ్చు. చిరు ప్లాన్ కూడా అదేనేమో..?
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా చిరుకి మరో ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. `అమీర్ ఖాన్ నటించిన ఏ సినిమాని మీరు తెలుగులో రీమేక్ చేస్తారు?` అని. దానికి చిరు ఎలాంటి హిపోక్రసీ లేకుండా సమాధానం చెప్పాడు. `అమీర్ ఖాన్ సినిమా చూడడమే గానీ, చేయడం కుదరదు..` అంటూ. అమీర్ ఇమేజ్ వేరు, చిరు ఇమేజ్ వేరు. రెండింటికీ పొంతన కుదరదు. అందుకే.. చిరు ఇలా స్పందించాల్సివచ్చింది.