బింబిసారతో ఆకట్టుకొన్న దర్శకుడు వశిష్ట. బింబిసార 2 పనులు కూడా మొదలైపోయాయి. అయితే ఈలోగా వశిష్టకి బంపర్ ఆఫర్ తగిలింది. చిరంజీవితో ఓ సినిమా ఓకే అయ్యింది. ఇదో సోఫియో ఫాంటసీ కథ. యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఆగస్టు నుంచి వశిష్టకు చిరు డేట్లు ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం భోళా శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు చిరు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొచ్చింది. ఆ తరవాత.. చిరు సినిమా వశిష్టతోనే.
నిజానికి చిరుతో సినిమా చేయాలన్న ఆలోచన వశిష్టకు లేదు. ఆయన చరణ్ కోసం ఓ కథ రాసుకొని.. ఆయన్ని ఒప్పించే పనిలో బిజీగా తిరుగుతున్నాడు. చరణ్ కథలన్నీ చిరునే వింటారు. అలా చరణ్ కథ చిరుకి వినిపించే సమయంలో.. మరో ఐడియాని చిరుతో పంచుకోవడం, అది చిరుకి నచ్చడం.. చరణ్ కథని పక్కన పెట్టి ఈ కథపై వర్క్ చేయమని చిరు ఆర్డర్ పాస్ చేయడం జరిగిపోయాయి. అలా.. చరణ్ తో సినిమా చేద్దామని వెళ్లిన వశిష్టకు.. చిరు నుంచి ఆఫర్ అందింది. ఈ సినిమాలో గ్రాఫిక్స్‌కి అధిక ప్రాధాన్యం ఉందట. అందుకే.. ప్రీ ప్రొడక్షన్ పనులకు తగిన సమయం తీసుకోవాలని వశిష్ట భావిస్తున్నాడు.