ఇది వరకు చిరంజీవిలాంటి స్టార్ హీరోతో సినిమా అంటే దర్శకులంతా తపస్సు చేయాల్సిన పరిస్థితి. కొత్త వాళ్లకు అవకాశాలు అస్సలు వచ్చేవి కావు. రెండు మూడు హిట్లు కొట్టినా అస్సలు పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు అలా కాదు. ఒక్క సినిమా చాలు. `హిట్` లిస్టులో చేరిపోవడానికి. నాగ్ అశ్విన్ కూడా అలా చిరంజీవి దృష్టిలో పడిపోయాడు. `మహానటి`తో నాగ్ అశ్విన్‌కి పెద్ద అవకాశాలే తలుపుతడతాయని భావించారు. కానీ మెగాస్టార్ పిలుపు మాత్రం ఎవ్వరూ ఊహించనిది. చిరంజీవితో అశ్వనీదత్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ దర్శకుడిగా సెట్ అవ్వడం.. చిత్రసీమని ఆకర్షిస్తోంది. అయితే ఈకాంబో సెట్టవ్వడమే విచిత్రంగా జరిగింది.
ఈరోజు ఉదయం చిరంజీవి తన స్వగృహంలో ‘మహానటి’ టీమ్‌ని సత్కరించాడు. ఈ సందర్భంలోనే స్వప్న దత్ ‘అంకుల్.. మీరు మా బ్యానర్లో సినిమా చేసి చాలా కాలమైంది’ అని అడిగింది. దానికి చిరు.. ‘నాకూ చేయాలనే ఉంది. ఈసారి.. మాయలు మంత్రాలు టైపులో సినిమా చేయాలి… పాతాళ భైరవిలా కథ ఉండాలి’ అన్నారు. యాధృచ్చికమైన విషయం ఏమిటంటే నాగ అశ్విన్ దగ్గర సరిగ్గా ఇలాంటి కథే ఉందట. అదే విషయం స్వప్న చెప్పడం… చిరంజీవి ఆశ్చర్యపోవడం ఒకేసారి జరిగిపోయాయి. ఆతరవాత అశ్వినీదత్ కూడా వచ్చి.. ‘చిరంజీవిగారితో మళ్లీ సినిమా చేయాలనిపిస్తోంది. నాగ్ అశ్విన్ దగ్గర ఓ మంచి కథ ఉంది. చిరంజీవిలాంటి స్టార్ ఆ కథకు కావాలి..’ అనగానే… పక్కనే ఉన్న చిరంజీవి ”ఓ.. ఆ సినిమా చేసేద్దాం” అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. టైమ్ మిషన్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ప్రస్తుతం లైన్‌గా మాత్రమే సిద్ధంగా ఉంది. కథగా మారడానికి మరో యేడాది టైమ్ పడుతుంది.