మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం లేదని.. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఊమెన్ చాందీ అధికారికంగా ప్రకటించారు. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి.. చేయాల్సిన పోరాటాలపై చర్చించేందుకు ఆయన చాలా రోజుల తర్వాత విజయవాడలో సమావేశం ఏర్పాటు చేశారు. అందరితో పాటు.. చిరంజీవికి కూడా సమాచారం పంపారు. కానీ చిరంజీవి వైపు నుంచి స్పందన లేదు. ఇది మొదటి సారి కాదు. ఏపీకి సంబంధించి ఢిల్లీలోఅియనా.. గల్లీలో అయినా ఏదైనా కార్యక్రమం ఉందంటే.. పీసీసీ తరపున అందరికీ సమాచారం వెళ్తుంది. చిరంజీవికి కూడా వెళ్తోంది.
కానీ ఆయన మాత్రం.. అటు పార్టీలో ఉన్నానని కానీ.. రాజీనామా చేశానని కానీ.. రాజకీయాల నుంచి విరమించుకున్నానని కానీ అధికారికంగా ప్రకటించలేదు. ఏ విషయం చెప్పకపోయే సరికి.. కాంగ్రెస్ నేతలు ఆయన ఇవాళ కాకపోతే రేపైనా .. యాక్టివ్ అవుతారేమో అని ఆశలో ఉన్నారు. కానీ.. ఆయన స్పందించే అవవకాశాలు కనిపించకపోవడంతో.. చాందీ ఇక చిరంజీవి కాంగ్రెస్‌లో లేరని తేల్చేసినట్లుగా తెలుస్తోంది. ఇతర సీనియర్ నేతలు అందరూ సమావేశాలకు వస్తున్నారని.. ఒక్క చిరంజీవి మాత్రమే రావడం లేదని… ఎవరు సమాచారం పంపినా స్పందించడం లేదని చాందీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో కలిపి కేంద్రమంత్రి పదవిని తీసుకుని ఆ పదవీ కాలం పూర్తయ్యాక సైలెంటయిపోయారు. కనీసం పార్టీకి రాజీనామా చేసినట్లుగా అయినా సామచారం పంపితే.. కాంగ్రెస్ హైకమాండ్‌కు గౌరవం ఇచ్చినట్లుగా ఉంటుందని… కానీ చిరంజీవి ఏమీ చెప్పకుండా.. స్పందించకుండా ఉండటం కాంగ్రెస్ హైకమాండ్‌ను అవమానించడమేనని కొందరు అంటున్నారు. మొత్తానికి చిరంజీవి విషయంలో.. కాంగ్రెస్ పార్టీకి ఓ క్లారిటీ వచ్చినట్లయింది.