ప్రత్యేక హోదా భరోసా సదస్సు పేరుతో గుంటూరులో భారీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరైన ఈ కార్యక్రమానికి ఏపీ కాంగ్రెస్ నేతలందరూ హాజరయ్యారు. కానీ, మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఈ సభలో కనిపించలేదు. ఈ మధ్య పార్టీ కార్యక్రమాలకు ఆయన రాకపోయినా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవడం మానేశారు! కానీ, రాహుల్ గాంధీ పాల్గొన్న ఈ సదస్సులో చిరంజీవి కనిపించకపోవడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. చిత్రం ఏంటంటే… ఈ కార్యక్రమానికి చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ మద్దతు పలకడం! ఆయన సభకు రాలేకపోయినా.. ఒక ట్వీట్ ద్వారా అయినా స్పందించారు. కానీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న చిరంజీవి ఏమయ్యారు అనేది ప్రశ్న..? ఇంత కీలక సదస్సుకు ఎందుకు రాలేదన్నది ప్రశ్న..?
నిజానికి, ఆయన చాన్నాళ్లుగా కాంగ్రెస్ పార్టీకి దూరంగానే ఉంటున్నారనే చెప్పాలి. ఆ మధ్య 150వ చిత్రం కోసం పనిచేస్తున్నా అంటూ కొన్నాళ్లపాటు పార్టీ కార్యక్రమాల నుంచి తప్పించుకున్నారు. ఆ తరువాత, ఏప్రిల్ లో జరిగిన ఏఐసీసీ సమన్వయ కమిటీ సమావేశానికి కూడా చిరంజీవి రాలేదు. ఆ సమయంలోనే చిరంజీవి కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పేట్టుగా ఉన్నారంటూ కథనాలు వచ్చేశాయి. ఎలాగూ పవన్ కల్యాణ్ రాజకీయాల్లో క్రియాశీలంగా మారుతున్నారు కాబట్టి, ఇకపై పొలిటికల్ కెరీర్ కి మెగాస్టార్ ఫుల్ స్టాప్ పెట్టేస్తారంటూ పుకార్లు షికార్లు చేశాయి. కానీ, ఆ సందర్భంలో వెంటనే చిరంజీవి స్పందించేశారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్లనే పార్టీ కార్యక్రమాలకు హాజరు కాలేదని అన్నారు. తాను ఎల్లప్పుడూ కాంగ్రెస్ తోనే ఉంటాననీ, పార్టీ కోసం పనిచేస్తానని చెప్పారు.
సరే… అప్పుడు విజయవాడలో జరిగిన సమన్వయ కమిటీ కార్యక్రమానికి హాజరు కాకపోవడానికి వ్యక్తిగత కారణాలున్నాయని చెప్పారు. మరి, నిన్న గుంటూరులో రాహుల్ గాంధీ వచ్చిన సభకు ఎందుకు రానట్టు..? పైగా, ఇది ప్రత్యేక హోదా భరోసా సభ. ఒక ప్రెస్ మీటో, ప్రెస్ నోటో విడుదల చేసి ఎందుకు రాలేదో చెప్పేసినా కొంత బాగుండేది. నిజానికి, ఏపీ కాంగ్రెస్ కు ఇప్పుడు ఒక జనాకర్షక నాయకుడి అవసరం ఉంది. మెగాస్టార్ చిరంజీవి యాక్టివ్ పార్ట్ తీసుకుంటే పార్టీకి ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని చిరంజీవి భుజానికి ఎత్తుకుని ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కానీ, ఎప్పుడైతే జనసేన పార్టీ అంటూ పవన్ జనంలోకి రావడం మొదలుపెట్టారో.. అప్పట్నుంచే చిరంజీవి మ్యూట్ అయిపోయారు. అలాగని, కాంగ్రెస్ ను వీడుతున్నాని కూడా చెప్పేంత ధైర్యం కూడా చేయడం లేదు.
చిరంజీవి పొలిటికల్ ఫ్యూచర్ ఏంటనేది మాత్రం ప్రస్తుతం ప్రశ్నార్థకంగానే ఉంది. ఎలాగూ వచ్చే ఎన్నికల్లో జనసేన కాస్త బలమైన రాజకీయ శక్తిగా ఎదిగే అవకాశం కనిపిస్తోంది. కాబట్టి, తెర వెనకనే ఉంటూ పవన్ కు మద్దతు ఇవ్వడమే ఉత్తమం అని చిరంజీవి భావిస్తున్నారేమో..! ఇకపై చిరంజీవి కేవలం పరోక్ష రాజకీయాలకే పరిమితం అవుతారేమో..! ఏదేమైనా, ఆయన కాంగ్రెస్ లో ఉంటున్నారో లేదో.. ఉంటే ఎందుకు క్రియాశీలంగా ఉండటం లేదో అనేది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.