చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా 151వ చిత్రం ఘనంగా మొదలైంది. హైదరాబాద్‌లో అశేష అభిమానుల మధ్య చిరు సినిమా లోగోని, మోషన్ పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి చిరు డుమ్మా కొట్టడం ఆశ్చర్యపరిచింది. చిరు హైదరాబాద్‌లోనే ఉన్నా – ఈ వేడుకకు రాకపోవడం పట్ల చిరు అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. అయితే చిరు మాత్రం దీన్నో సెంటిమెంట్‌గా భావిస్తున్నాడట. గతేడాది చిరు పుట్టిన రోజు వేడుకలు కూడా ఇలానే శిల్పకళావేదికలో ఘనంగా జరిగాయి. చిరు మాత్రం ఆ కార్యక్రమానికి హాజరవ్వలేదు. ఎంతో ప్రతిష్టాత్మకమైన తన 150వ చిత్రానికి సంబంధించిన తొలి ఈవెంట్లో చిరు హాజరు కాకపోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. అయితే ఆ సినిమా హిట్టయి.. చిరు పాత రికార్డులన్నీ తిరగరాసింది. అదే సెంటిమెంట్‌తో తన 151వ సినిమాకి సంబంధించిన తొలి ప్రమోషన్ ఈవెంట్‌కి చిరు గైర్హజరు అయ్యాడట. మహేష్ బాబు కూడా ఇంతే కదా? తన సినిమా ప్రారంభోత్సవాలకు డుమ్మా కొడుతుంటాడు. అది సెంటిమెంట్‌గా మారిపోయింది. బహుశా.. మహేష్‌లా చిరు కూడా అదే సెంటిమెంట్‌గా ఫీలవుతున్నాడేమో.