తొమ్మిదేళ్ల తరవాత చిరంజీవి రీ ఎంట్రీ ఎలా ఉండబోతోంది?? చిరు కి అభిమానుల నుంచి ఎలాంటి స్వాగతం లభిస్తుంది? చిరు ఎప్పటిలా అలరించగలడా?? అనే ప్రశ్నలకు ఖైదీ నెం.150 సమాధానం చెప్పేసింది. ఇది ఆహా… ఓహో అనిపించే సినిమా ఏం కాదు. కానీ… చిరు అభిమానుల్ని మాత్రం నూటికి నూరుపాళ్లూ సంతృప్తి పరచిన సినిమా. చిరు నటనలో, డాన్స్‌లో గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించిన సినిమా. బాక్సాఫీసు దగ్గర కూడా సూపర్ కలక్షన్లు రాబడుతోంది. దాంతో… మెగా కాంపౌండ్‌లో చెప్పలేనంత ధీమా వచ్చేసింది. ఖైదీ నెం.150 రిజల్ట్ చూసి తన నెక్ట్స్ సినిమాల్ని ప్లాన్ చేసుకోవాలని భావిస్తున్న చిరు.. ఈ వసూళ్లతో సంతృప్తి చెందినట్టే. అందుకే ఇక వరుసగా సినిమాల్ని తెరకెక్కించడానికి ప్లానింగ్ చేసేస్తున్నాడు.
చిరు 151వ సినిమా ఏప్రిల్‌లో పట్టాలెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. దర్శకుడు… కథా కమామిషూ ఫిబ్రవరి చివరి వారం నాటికి సెట్ చేసి, ఏప్రిల్‌లో షూటింగ్ మొదలెట్టే ఉద్దేశంలో ఉన్నాడు చిరు. వీలైతే 2017లోనే 151వ సినిమానీ విడుదల చేయాలని భావిస్తున్నాడు. మరో రెండు మూడేళ్ల పాటు యేడాదికి రెండు సినిమాలు పూర్తి చేయాలన్నది చిరు లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ విషయంలో చరణ్ కూడా క్లారిటీగానే ఉన్నాడు. ”నాన్నగారి మూడ్ అంతా ఇప్పుడు సినిమాలపైనే ఉంది. ఇక కంటిన్యూస్‌గా సినిమాలు చేస్తారు. 150 వసినిమా కోసం విన్న కథల్లో కొన్నింటిని పక్కన పెట్టాం. వాటిలోంచి కూడా ఓ కథ ఎంపిక చేసుకొనే అవకాశం ఉంది. 151వ సినిమా కోసం అతి త్వరలోనే ఓ అధికారిక ప్రకటన విడుదల చేస్తాం” అని హింట్ ఇచ్చేశాడు.