లైలా ప్రమోషన్స్ లో విశ్వక్ సేన్ కి కాంపౌండ్ ప్రశ్న ఎదురైయింది. బాలకృష్ణ, ఎన్టీఆర్ తో సన్నిహితంగా వుండే విశ్వక్ సినిమాకి చిరంజీవి ముఖ్య అతిధిగా రావడంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్న వైరల్ అయ్యింది. ఈ ప్రశ్న చిరంజీవి దాక వెళ్ళింది. లైలా ఈవెంట్ లో ఈ టాపిక్ పై క్లాస్ తీసుకున్నారు చిరు.
‘విశ్వక్ ఫంక్షన్ కి వెళ్తున్నావా? అని అడిగారు. ఏం ఎందుకు వెళ్ళకూడదు? అతను మన మనిషి కాదు.. బాలకృష్ణ.. అప్పుడప్పుడు తారక్ అంటాడు. అంటే మనుషులంటే వేరే వాళ్ళ మీద అభిమానం ప్రేమ ఉండకూడదా? మా ఇంట్లోనే మా అబ్బాయికి సూర్య అంటే చాలా ఇష్టం. అంత మాత్రాన వాడి ఫంక్షన్ కి నేను వెళ్ళకూడదా? విశ్వక్ కి ఈ ప్రశ్న అడగడం నేను చూశాను. దానికి విశ్వక్ చాలా చక్కని సమాధానం చెప్పాడు. మా ఇంటికి కాంపౌండ్ ఉంటుంది కానీ సినిమా ఇండస్ట్రీకి కాంపౌండ్ లేదు అన్నాడు. ఇంతగా సమాధానం చెప్పిన తనని అభినందిస్తున్నాను’ అన్నారు చిరు.
‘అభిమానులు వాల్ పోస్టర్లు చింపుకోవడం నేను చూశాను. మా కజిన్స్ లో ఒకరు రామారావు గారిని, ఒకరు ఏఎన్ఆర్ గారి అభిమానించి ఒకరిని ఒకరు కొట్టుకునేవారు. హీరోలు బాగానే వుంటారు. అభిమానులు కొట్టుకుంటున్నారనే ఆలోచన ఆ రోజు నుంచే మొదలైయింది. నేను ఫిల్మ్ యాక్టర్ అయిన తర్వాత హీరోల మధ్య సక్యత సహ్రుద్బావ వాతావరణం ఏర్పాటు చేయాలని బలంగా కోరుకున్నాను. మద్రాస్ లో హనీ హౌస్ లో అందరం కలిసి పార్టీలు చేసుకునే వాళ్ళం. ఈ రోజుకి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున మేమంతా కలసికట్టుగా వుంటాం. మా మధ్య ఎలాంటి అరమరికలు లేవు. ఇండస్ట్రీలో ఒక సినిమా ఆడింది అంటే అందరం ఆనందం పడాలి. ఆ ఆనందం ఇవ్వడానికి ఈ వేడుకకు వచ్చాను. ఇండస్ట్రీ ఒకటే కాంపౌండ్’ అని కాస్త గట్టిగానే తన స్వరం వినిపించారు.
ఇదే వేడుకలో తన కొత్త సినిమాపై ప్రకటన చేశారు’ సాహు నిర్మాతగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నేను ఒక సినిమా చేయబోతున్నాను. సినిమా సమ్మర్ లో ప్రారంభం కాబోతోంది. ఇది ఫుల్ లెంత్ కామెడీగా వుంటుంది. సాహు, గోల్డ్ బాక్స్ కొణిదెల సుస్మిత కలసి ఈ సినిమాని నిర్మిస్తారు’ ప్రకటించారు చిరు.