చిరంజీవి – నాగార్జున మధ్య మంచి స్నేహం ఉంది. అగ్ర హీరోల్లో కలిసి మెలిసి ఉండేవి వాళ్లే. ఆ మాటకొస్తే…. కొన్ని వ్యాపారాల్లోనూ వీళ్లు భాగస్వాములు. చిరు గురించి నాగ్ ఎప్పుడూ గొప్పగా చెబుతూనే ఉంటాడు. చిరు కూడా… తన స్నేహ ధర్మాన్ని వీలున్నప్పుడల్లా నిర్వహిస్తూ ఉంటాడు. తాజాగా `వైల్డ్ డాగ్` ని మెచ్చుకుంటూ చిరు ట్వీట్ చేశాడు. అంతే కాదు.. `ఓ ప్రెస్ మీట్ పెట్టండి… నేనొచ్చి ఈ సినిమా గురించి మాట్లాడతాను` అని తనకు తానే.. ముందుకొచ్చి – మీడియా సమావేశం ఏర్పాటు చేయించాడు.
ఓ అగ్ర హీరో చేసిన సినిమాని మెచ్చుకుంటూ మరో అగ్ర హీరో ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం నిజంగా మంచి పరిణామం. ఈ ప్రెస్ మీట్ కేవలం `వైల్డ్ డాగ్`ని ప్రమోట్ చేయడానికే అనే లక్ష్యాన్ని చిరు కూడా మర్చిపోలేదు. చిరు కనిపించగానే మీడియా వాళ్లకు ఎన్నో ప్రశ్నలు గుర్తొస్తాయి. ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లోనూ మీడియా మిత్రులు చిరంజీవిపై రకరకాల ప్రశ్నలు సంధించే ప్రయత్నం చేశారు.చిరు మాత్రం ` ఈ ప్రెస్ మీట్ కేవలం.. ఈ సినిమా కోసమే. మనం ఏదో మాట్లాడితే.. అసలు లక్ష్యం పక్కదారి పడుతుంది` అంటూ సున్నితంగా వారించారు. వైల్డ్ డాగ్ కి మంచి టాక్ ఉన్నా, సరైన వసూళ్లు లేవు. వచ్చే వారం `వకీల్ సాబ్` వచ్చేస్తాడు. ఆ సినిమా వస్తే.. అన్ని థియేటర్లూ `వకీల్ సాబ్` చేతికి వెళ్లిపోతాయి. ఎంత రాబట్టినా ఈ నాలుగు రోజుల్లోనే. కాబట్టి చిరు ముందుకొచ్చి ఈసినిమాని ప్రమోట్ చేసే బాధ్యత తీసుకున్నాడు. తన స్నేహితుడి కోసం.