ఎక్కడ చూసినా సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఫంక్షన్ గురించే డిస్కషన్.
మహేష్ బాబు ఏం మాట్లాడాడు? ట్రైలర్ ఎలా వుంది? స్టేజీపై దేవిశ్రీ ప్రసాద్ చేసిన హంగామా ఏం రేంజులో పండింది? అనే విషయాలు ఎవ్వరూ మాట్లాడుకోవడం లేదు. చిరంజీవి – విజయశాంతి మధ్య జరిగిన ఎపిసోడ్ గురించే చర్చంతా. చిరు భలేగా కవర్ చేసుకున్నాడని కొందరు, అసలు ఈ అసందర్భ ప్రసంగం ఎందుకు? అంటూ మరికొందరు.. ఫంక్షన్ మహేష్‌ది అయితే, దాన్ని వాడుకున్నది చిరంజీవి అని ఇంకొందరు. రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు.
నిజం కూడా అదే. ఈ ఫంక్షన్‌ని మహేష్ కంటే చిరంజీవినే బాగా వాడుకున్నాడనిపిస్తుంది. అందుకు 3 కారణాలు ఉన్నాయి.
1. విజయశాంతి:
విజయశాంతితో చిరంజీవి వైరం గురించి తెలియంది కాదు. ఇద్దరి మధ్య గ్యాప్ చాలానే ఉంది. గ్యాంగ్ లీడర్ సమయంలో ఇద్దరి మధ్యా గొడవలు వచ్చాయని, నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారని అప్పట్లో కథలు కథలుగా చెప్పుకున్నారు. ఆ తరవాత ఇద్దరూ కలిసి మెకానిక్ అల్లుడు సినిమాలో నటించారు. అయితే ఆ సినిమా ఫ్లాప్. ఆ తరవాత కూడా ఇద్దరి మధ్య వైరం నడుస్తూనే ఉంది. రాజకీయాల్లోకి వెళ్లాక చిరంజీవిపై చాలాసార్లు కామెంట్లు చేసింది విజయశాంతి. అవన్నీ గుర్తు చేసి, తన పాత వైరాన్ని మర్చిపోయి.. విజయశాంతి తో స్నేహం కొనసాగించడానికి చిరంజీవి ఈ వేడుకని వేదిక చేసుకున్నాడు. `మీరు నా హీరోనే` అని విజయశాంతితో అనిపించుకున్నాడు.
2. కొరటాల శివకు డెడ్ లైన్
చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్లో ఓ సినిమా సాగుతోంది. దాన్ని వీలైనంత త్వరగా ముగించాల్సిన బాధ్యతని కొరటాలపై పెట్టాడు చిరు. ఈ వేదికపై నుంచే 99 రోజులు దాటకూడదు.. అంటూ డెడ్‌లైన్ విధించాడు. అశేష అభిమానుల మధ్య చిరు గీత గీసేశాడు. ఇక దానికి కట్టుబడి ఉండాల్సిన బాధ్యత కొరటాలదే.
3. చరణ్ ని స్తుతించడం
సొంత డబ్బా, పర డబ్బా, పరస్పర డబ్బా – ఆడియో వేదికలంటే ఇంతే కదా? చిరు దాన్ని కూడా వాడుకున్నాడు. మహేష్‌ని పొగుడుతూనే చరణ్‌నీ గుర్తు చేశాడు. మహేష్ అడ్వాన్సు తీసుకోకుండా సినిమాని పనిచేశాడని, అది నిర్మాతలకు లాభమని, చరణ్ కూడా అదే చేస్తుంటాడని, అప్పట్లో తాను కూడా అడ్వాన్సులు తీసుకోకుండా నిర్మాతల పక్షపాతిగా ఉన్నానిని చిరు గుర్తు చేసుకున్నాడు.
ఇక ఈ వేడుకతో చిరంజీవి వల్ల మహేష్‌కి కలిగిన ఉపయోగాలు లేవా అంటే… ఉన్నాయి.
కృష్ణకు దాదా సాహెబ్ ఫాల్కే ఇవ్వాలి అన్న చిరు డిమాండ్ – మహేష్‌కి తప్పకుండా నచ్చి ఉంటుంది. ఇండియన్ సినిమాని శాశించగల నటుడు చిరంజీవి. కనీసం తెలుగు రాష్ట్రాలలో అయినా తనకు పలుకుబడి ఉంది. ఆ విషయం ఎవరూ కాదనలేరు. అలాంటి నటుడు నుంచి దాదా సాహెబ్ ఫాల్కే డిమాండ్ వినిపించింది. భవిష్యత్తులో ఈ విషయంపై మరింత మంది గళం విప్పడం ఖాయం. కృష్ణకు దాదా సాహెబ్ ప్రకటిస్తే.. ఆ క్రెడిట్ తప్పకుండా ఇప్పుడు చిరుకి చేరుతుంది. సో.. ఈ రకంగా చిరు తనకు మేలు చేశాడనే చెప్పాలి.