‘లైలా’ సినిమా ఈవెంట్ లో చిరంజీవి ఓ పొలిటికల్ కామెంట్ చేశారు. ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందిది. ఐ యామ్ హ్యాపీ’ అని చిరంజీవి వేదికపై ప్రకటించడం పొలిటికల్ సర్కిల్స్ హాట్ టాపిక్ గా మారింది. ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందడం ఏమిటి? రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కి చిరంజీవికి ఉన్నా తేడా ఏమిటనే అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయంశమయ్యాయి.
భారీ అంచనాలతో రాజకీయ రంగప్రవేశం చేశారు చిరంజీవి. ప్రజారాజ్యం పార్టీని ఓ సునామీలా ప్రకటించారు. ఎన్నో అంచనాలతో ఎన్నికల్లోకి వెళ్లారు. అయితే తొలి ఎన్నికల్లోనే ముఖ్యమంత్రి అయిపోదామనే కల నెరవేరలేదు. 18 సీట్లతో సరిపెట్టుకున్నారు.18 సీట్లు అంటే మాటలు కాదు. ప్రజల తరపున బలమైన గొంతుక వినిపించే అవకాశం ప్రజారాజ్యం పార్టీకి వచ్చింది. కానీ చిరంజీవి ప్రతిపక్షంలో ఉండటానికి ఇష్టపడలేదు. తనకి రాజకీయాలు కిట్టవని పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. ఓ కేంద్రమంత్రి పదవితో సంతోషపడి మళ్ళీ సినిమాల్లోకి వచ్చేశారు.
కానీ జనసేన ప్రయాణం ఇలా కాదు. నిజానికి ఒక ప్రత్యేక పార్టీ పెట్టాలని పవన్ కళ్యాణ్ ఎన్నడూ అనుకోలేదు. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి విలీనం చేయకపోతే జనసేన పుట్టేదే కాదని పవన్ కళ్యాణ్ కొన్ని సందర్భాల్లో చెప్పారు. ప్రజారాజ్యన్ని విలీనం చేయడం పవన్ కళ్యాణ్ కి ఏ మాత్రం ఇష్టం లేదు. కానీ అన్నయ్య మాట కాదనలేక మౌనంగా ఉండిపోయారు. ఎన్నో ఆశలు ఆశయాలతో పెట్టిన పార్టీని అంత తొందరగా విలీనం చేయడం, ఆ క్రమంలో వచ్చిన విమర్శలు పవన్ కళ్యాణ్ ని చాలా బాధించాయి. ఈ విషయంలోనే చిరంజీవికి పవన్ కి దూరం పెరిగిందనే మాట కూడా వాస్తవమే.
తాను ఏ లక్ష్యంతోనైతే రాజకేయాల్లోకి వచ్చారో ఆ లక్ష్యాన్ని చేధించే దిశగా మళ్ళీ అడుగులు వేసిన పవన్ జనసేన పార్టీకి శ్రీకారం చుట్టారు. ఆ పార్టీ పెట్టినప్పుడు కూడా పవన్ వెంట తన కుటుంబం లేదు. ఒంటరిగానే ప్రయాణం మొదలుపెట్టారు. ప్రజారాజ్యం సమయంలో జరిగిన తప్పులని మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకున్నారు. తొలి ఎన్నికల్లో అసలు పోటీ చేయలేదు. రాష్ట్ర విభజన తర్వాత బలమైన నాయకత్వం కొత్త రాష్ట్రానికి అవసరమని నమ్మిన పవన్ కళ్యాణ్, అపారమైన అనుభవం కలిగిన చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆయనకి మద్దతు ఇచ్చారు. అప్పట్లో ఈ విషయంలో పవన్ పై చాలా విమర్శలు వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయంగా తీసుకున్న ఆ నిర్ణయం తర్వాత ఎంతమంచి ఫలితాల్ని ఇచ్చిందో అందరికీ తెలుసు.
జనసేన ప్రయాణం ప్రజారాజ్యం అంత అనుకూలంగా కూడా జరగలేదు. ప్రజారాజ్యం పోటీ చేసి 18 సీట్లు తెచ్చుకుంటే.. జనసేన పోటీ చేసిన తొలి ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కి పరిమితమైయింది. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు. గెలిచిన ఒక్క అభ్యర్ధి కూడా వైసీపీ విధేయుడిగా మారిపోయారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితిని నుంచి పార్టీని నెట్టుకుంటు రావాడం అంత ఆషామాసీ కాదు. కానీ పవన్ కళ్యాణ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. తనని పవర్ లెస్ స్టార్, జీరో స్టార్ అని హేళన చేస్తున్నా.. అవన్నీ దిగమింగుకుని గొప్ప గుండెధైర్యంతో మళ్ళీ ప్రజలతో మమేకం అయ్యారు. ఒక్కసీటు లేకపోయినా ప్రజల గొంతుక వినిపించడంలో కొత్తవరవడి సృష్టించారు. పవన్ కళ్యాణ్ పోరాట పటిమ చూసి ఇలాంటి నాయకుడిని అసెంబ్లీకి పంపకుండా తప్పు చేశామనే భావన ప్రజల్లోనే వచ్చింది. దీంతో ఈ ఎన్నికల్లో ప్రజలు జనసేనకి అఖండ విజయాన్ని ఇచ్చారు. వందశాతం స్ట్రైక్ రేట్ తో 21 స్థానాలు సాధించి రాష్ట్ర రాజకీయాల్లో గేమ్ చేంజర్ గా మారారు పవన్ కళ్యాణ్.
జనసేన, ప్రజారాజ్యం తాను ముక్కే అని, ఎదోరోజు పార్టీని విలీనం చేసి చేతులు కడుక్కుంటారని ప్రతిపక్షాలు విమర్శిస్తుంటాయి. అయితే పవన్ కళ్యాణ్ పార్టీని నడిపిన విధానం, తన ఐడియాలజీ, ఈ ఎన్నికల్లో విజయం.. ఆ విమర్శని తిప్పికొట్టింది. ఇలాంటి పరిస్థితిలో స్వయంగా చిరంజీవి ‘ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం చెందింది’ అని చెప్పడం మళ్ళీ ప్రతిపక్షాలకు ఓ ఆయుధం చేతికి ఇచ్చినట్లయింది.
నిజానికి చిరంజీవి రాజకీయాలకు దూరమైపోయారు. జనసేనని కూడా ఆయన ఎప్పుడూ వోన్ చేసుకోలేదు. అయితే జనసేన అఖండ విజయం, పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి కావడంతో ఆయనలో మళ్ళీ కొత్త ఆశలు చిగురించినట్లుగానే భావించాలి. నిజానికి తమ్ముడి మీద ప్రేమ వుంటే.. పవన్ నా ఆశయాలని నెరవేరుస్తున్నాడని అంటే సరిపోయేది. కానీ ఆయన ప్రజారాజ్యం జనసేనగా రూపాంతరం అని చెప్పడం పవన్ ని పొలిటికల్ గా ఇరకాటంలో పెట్టే స్టేట్మెంట్ అనే చెప్పాలి.