ఆచార్య ఫ్లాప్ అయిన తరవాత ఆ సినిమా గురించి పెద్దగా స్పందించలేదు చిరు. ఓ కార్యక్రమంలో మాత్రం దర్శకులపై సెటైర్లు వేశాడు. సెట్లోనే సీన్లు రాస్తున్నారని, దాని వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని పరోక్షంగా కొరటాల శివపై బాణాన్ని ఎక్కుపెట్టాడు. ఇప్పుడు మాత్రం డైరెక్టర్‌గానే ఆచార్య ఫ్లాప్‌ని కొరటాలపై తోసేశాడు. గాడ్ ఫాదర్ సినిమా విడుదల సందర్భంగా బాలీవుడ్ మీడియాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు చిరు. ఈ సందర్భంగా ఆచార్య ఫ్లాప్ ప్రస్తావన వచ్చింది. `ఆ సినిమా ఫ్లాప్ విషయంలో బాధ పడడం లేదు. నేను దర్శకుడు చెప్పినట్టే చేశా` అంటూ ఈ ఫ్లాప్‌కి కర్త, కర్మ, క్రియ.. కొరటాలనే అన్నట్టు మాట్లాడాడు చిరు.
”ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో హిట్, ఫ్లాప్‌కి చాలా ప్రాధాన్యం ఇచ్చేవాడ్ని. ఫ్లాప్ వస్తే బాధ పడడం, హిట్ కొడితే ఆనందించడం చాలా కామన్ గా ఉండేది. కానీ… ఆ తరవాత ఆ రెండింటికీ ప్రాధాన్యం తగ్గిపోయింది. అందుకే ఆచార్య ఫ్లాప్ విషయంలోనూ బాధ లేదు. కాకపోతే… నేనూ,చరణ్ కలసి నటించిన సినిమా అది. భవిష్యత్తులో మరోసారి మేమిద్దరం కలిసి నటించాలనుకొంటే ఇంత జోష్ ఉండకపోవొచ్చు” అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. చిరు గాడ్ ఫాదర్ దసరా కానుకగా అక్టోబరు 5న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే.