ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి శుక్రవారం సమావేశం కాబోతున్నారు. రామ్‌చరణ్‌తో కలిసి రేపు ఆయన అమరావతి వెళ్లనున్నారు. కేవలం సైరా నరసింహారెడ్డి సినిమా చూసేందుకు ఆహ్వానించేందుకు మాత్రమే… చిరంజీవి, రామ్ చణ్ జగన్ తో సమావేశమవుతున్నారని… మెగా క్యాంప్ వర్గాలు చెబుతున్నాయి. సైరాను చూడాలని ఇప్పటికే తెలంగాణ గవర్నర్ తమిళిశైను చిరంజీవి ఆహ్వానించారు. ఆమె కోసం ప్రసాద్ ఐమ్యాక్స్ లో ప్రత్యేకమైన షో కూడా వేశారు. ఇప్పుడు… ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ఆహ్వానించబోతున్నారు. అయితే జగన్ కు ఉన్న తీరిక లేని షెడ్యూల్లో సినిమాకు సమయం కేటాయించడం కష్టమని అంటున్నారు.
రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించిన .. సైరా నరసింహారెడ్డికి జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియా గ్రూప్ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది. ప్రి రిలీజ్ ఈవెంట్ ను తమ చానల్లో లైవ్ టెలికాస్ట్ చేసింది. ఆ కారణంగా.. ఇతర కారణాల వల్లో కానీ.. సహజంగా.. మెగా కుటుంబానికి చెందిన సినిమాలపై కనిపించే నెగెటివ్ వార్తలు సైరా విషయంలో సాక్షి మీడియాలో కనిపించలేదు. అంతే కాదు.. ప్రభాస్ సాహో సినిమాకు ప్రీమియర్లు, ప్రత్యేక షోల ప్రదర్శన, టిక్కెట్ రేట్ల పెంపునకు.. ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. అయితే సైరా విషయంలో మాత్రం ఇందు కోసం ప్రత్యేకంగా జీవోలు జారీ చేశారు. ఏపీ సర్కార్ వైపు నుంచి పూర్తి సానుకూలత ఉండటంతో.. సినిమా చూసేందుకు జగన్ ను పిలవాలని చిరంజీవి, రామ్ చరణ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
అయితే సైరా సినిమా చూడాలని ప్రముఖుల్ని పిలిచే క్రమంలో చిరంజీవి, రామ్ చరణ్ ప్రయారిటీ ఏమిటో అర్థం కావడం లేదనే వాదన టాలీవుడ్ లో వినిపిస్తోంది. తెలంగాణ సీఎం ను కానీ..కేటీఆర్ ను కానీ ఆహ్వానించలేదు. కానీ గవర్నర్ ను ఆహ్వానించారు. ఏపీ సీఎంను ఆహ్వానిస్తున్నారు కానీ.. గవర్నర్ గురించి ఆలోచన చేయడం లేదు. పబ్లిసిటీ విషయంలో తడబడుతున్న సైరా టీం … ఈ విషయాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోలేకపోతోందన్న చర్చ టాలీవుడ్ లో జరుగుతోంది.