రాజకీయాలకు పొరపాటుగా వెళ్ళానని ఇదివరకే చాలా సందర్భాల్లో తన మనసులో మాట పంచుకున్నారు చిరంజీవి. తాజాగా ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్వహించిన సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలో ఈ ప్రస్తావన వచ్చింది. ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు చిరంజీవి. మురళీ మోహన్ చేతులు మీదగా చిరుకి సత్కార కార్యక్రమం జరిగింది.
ఆనంతరం చిరంజీవి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘ప్రజా సేవ చేయొచ్చని రాజకీయల్లోకి వెళ్లాను. కానీ నేను రాజకీయాలకు అనర్హుడిని. నాలాంటి వాడు అక్కడ మనలేడు. పొరపాటున అక్కడికి వెళ్లాను. సేవ చేయాలంటే రాజకీయాలకే వెళ్ళాల్సిన అవసరం లేదు. రాజకీయల నుంచి మళ్ళీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత అభిమానులు, ప్రేక్షకులు చూపించిన ఆదరణ మర్చిపోలేను. అదే రక్తం, అదే పౌరుషం అనే డైలాగ్ లా.. ఇన్నేళ్ళకు వచ్చినా అదే అభిమానం, అదే ప్రేమ అని చాటి చెప్పారు. ఓపిక ఉన్నంతవరకూ ఆదరణ ఉన్నంత వరకూ సినిమాల్లోనే వుంటాను’ అని చెప్పుకొచ్చారు చిరు.
ఇదే సందర్భంలో పద్మ విభూషణ్ వచ్చిన తర్వాత చిరుకు చిత్ర పరిశ్రమ సరైన సన్మాన వేడుక చేయలేదనే మురళి మోహన్ అసంతృప్తిపై కూడా చాలా హుందాగా స్పందించారు చిరు. ‘నాకు అవార్డ్ వచ్చిన తర్వాత దాదాపు ఆరు రోజులు పాటు పరిశ్రమలోని అందరూ ఇంటికి వచ్చి అభినందించారు. ఆరు రోజులు పాటు ఒక సంబరంలా జరిగింది. పూలు, పళ్ళు, స్వీట్లు, ముఖ్యంగా అందరి ప్రేమతో ఇళ్ళంతా నిండిపోయింది. ప్రత్యేకంగా పరిశ్రమ సత్కారించలేదనే వెలితి నాకు లేదు” అని తనదైన శైలిలో స్పందించారు చిరు.