సందీప్ కిషన్ సినిమా ‘మజాకా’ ఈవారమే వస్తోంది. నక్కిన త్రినాథరావు దర్శకుడు. రాజేష్ దండా నిర్మాత. ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. సందీప్ కెరీర్‌కు హైప్ ఇస్తుందన్న భరోసా కలుగుతోంది. తండ్రీ కొడుకుల కథ ఇది. ఇద్దరూ వేర్వేరు అమ్మాయిలతో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్నది సబ్జెక్టు. అయితే ఈ కథ ముందుగా చిరంజీవి దగ్గరకు వెళ్లింది. తండ్రిగా చిరంజీవి, కొడుకుగా సిద్దు జొన్నలగడ్డ ని కలిపి ఈ సినిమా చేద్దామనుకొన్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయిన’ ఫేమ్ కల్యాణ్ కృష్ణ దర్శకుడు. దాదాపుగా సెట్ అవ్వాల్సిన ప్రాజెక్ట్ ఇది. కానీ మిస్సయ్యింది. దాంతో చిరు ఫ్యాన్స్ కాస్త నిరాశ పడ్డారు. చిరు – సిద్దు జొన్నలగడ్డ ఇద్దరూ కలిసి ఫన్ చేస్తే చూడాలని ఎవరి ఉండదు. ఆ ఛాన్స్ మిస్సయ్యింది.
అయితే చిరు ఈ కథని వదిలేసి మంచి పని చేశాడన్నది ఇన్ సైడ్ వర్గాల టాక్. దానికీ ఓ కారణం ఉంది. ఇందులో తండ్రి పాత్ర చిరు స్థాయికి సరిపోదట. ఈ విషయాన్ని సందీప్ కిషన్ స్వయంగా చెప్పాడు. దర్శకుడు నక్కిన త్రినాథరావుదీ ఇదే మాట. ”చిరంజీవి గారి దగ్గరకు ఈ కథ వెళ్లిన మాట వాస్తవం. అయితే ఆ వెర్షన్ ఎలాంటిదో నాకు తెలీదు. రావు రమేష్ ఇమేజ్‌కీ, ఆయన వయసుకీ తగ్గ పాత్ర ఇది. ఎంతైనా చిరు ఇమేజ్ వేరు కదా, ఆయన ముందు కథ చిన్నదైపోతుంది” అనే అభిప్రాయం వ్యక్తం చేశారు నక్కిన. సందీప్ కిషన్ కూడా ఇదే మాట చెబుతున్నాడు.
కొన్ని కథలు బాగుండొచ్చు. కానీ ఇమేజ్‌కి సరిపోవాలి. రావు రమేష్ పాత్రలో చిరుని ఊహించుకోలేం. ఎవరి ఇమేజ్ వారిది. చిరంజీవి కూడా అందుకే ఈ కథని పక్కన పెట్టేశాడేమో..?!