చిరంజీవి కెరీర్లో మర్చిపోలేని సినిమా `ఠాగూర్`. ఇది కూడా రీమేకే. తమిళంలో సూపర్ హిట్టయిన `రమణ` దీనికి ఆధారం. ఈ సినిమా రీమేక్ బాధ్యతని చిరంజీవి వివి వినాయక్ కి అప్పగించాడు. వినాయక్ కూడా తన పనిని సమర్థవంతంగా నిర్వహించాడు. రమణలో కీలకమైన మార్పులు చేసి, చిరంజీవికి ఓ సూపర్ హిట్ అందించాడు. అయితే.. ఈ సినిమాకి ముందు అనుకొన్న దర్శకుడు మురుగదాసే. రమణ కి ఆయనే డైరెక్టర్. తనతోనే రీమేక్ కూడా తీయాలని చిరు భావించాడు. కానీ చిరుకీ.. మురుగదాస్కీ కుదర్లేదు. రమణలో చిరంజీవి అండ్ కో చేసిన మార్పులు మురుగదాస్ కి నచ్చలేదు. దాంతో.. `ఈ సినిమానేను చేయలేను` అని సైడ్ అయిపోయాడు. ఈ విషయాన్ని చిరునే చెప్పుకొచ్చాడు. ఈరోజు హైదరాబాద్ లో విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ .. `ఠాగూర్` విషయాల్ని ఓసారి గుర్తు చేసుకొన్నారు చిరు.
”రమణ రీమేక్ బాధ్యతల్ని మురుగదాస్ కే అప్పగిద్దాం అనుకొన్నా. కానీ… తెలుగులోకి తీసుకురావాలంటే కొన్ని మార్పులు చేయాలి. రమణ కథ చాలా ‘రా’గా ఉంటుంది. పాటలు ఉండవు. హీరో చివర్లో చచ్చిపోతాడు. తెలుగులో తీసినప్పుడు నేనూ చచ్చిపోతే… నిర్మాతా చచ్చిపోతాడు (నవ్వుతూ). నా పై అలాంటి క్లైమాక్స్ చూడలేరు. అందుకే… హీరోని బతికిద్దాం అని మురగదాస్ తో చెప్పా. కానీ తాను ఒప్పుకోలేదు. ‘నా హీరో త్యాగశీలి.. తను చచ్చిపోతేనే ఆ క్యారెక్టర్ నిలబడుతుంది’ అన్నాడు. పాటలు వద్దన్నాడు. అప్పటికి నాపై అలాంటి ప్రయోగం చేయలేను. అందుకే… వినాయక్ తో రీమేక్ పట్టాలెక్కించాను” అని ఠాగూర్ నాటి సంగతుల్ని గుర్తు చేసుకొన్నారాయన.
చిరంజీవి కెరీర్లో రీమేక్ సినిమాలు ఎక్కువగా కనిపిస్తాయి. దానికి గల కారణం కూడా ఈ సందర్భంగా చిరు వివరించారు. ”నాపై కోట్లాది రూపాయల పెట్టుబడి పెడుతున్నారు నిర్మాతలు. బయ్యర్లు భారీ మొత్తానికి కొంటున్నారు. నా చుట్టూ ఇంత రిస్క్ జరుగుతున్నప్పుడు సేఫ్ బెట్టింగ్ మంచిదనిపించింది. అందుకే చాలాసార్లు రీమేకులు ఎంచుకొన్నా. రీమేక్ కథైనా.. ఒర్జినల్ కంటే బెటర్ గానే తీయడానికి ప్రయత్నించాం. కొన్నిసార్లు మాతృక కంటే… రీమేకులే పెద్ద హిట్టయ్యాయి..” అని రీమేకులపై ఎందుకు ఆధారపడాల్సివచ్చిందో చెప్పుకొచ్చారు.