ఈరోజుల్లో తారల పారితోషికాలన్నీ కోట్లల్లోనే. వంద కోట్లు అందుకోవడం చాలా ఈజీ అయిపోయింది. ఒకప్పుడు సినిమాకు రూ.100 కోట్లు వస్తే ఓ సంచలనం. ఇప్పుడు ఓ హీరోకి రూ.100 కోట్ల పారితోషికం ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, చరణ్… వీళ్లంతా రూ.100 కోట్ల హీరోలే. సీనియర్ హీరోల్లో అత్యధిక పారితోషికం తీసుకొంటోంది చిరంజీవి మాత్రమే. చిరు, నాగ్, బాలయ్య, వెంకీ.. ఈ బ్యాచ్ లో ముందు నుంచీ పారితోషికం విషయంలో చిరుదే అగ్ర తాంబూలం. ఈ జనరేషన్‌లోనూ అదే టెంపో కొనసాగుతోంది. ‘ఖైదీ నెంబర్ 150’, ‘వాల్తేరు వీరయ్య’ ఇలా మంచి కమర్షియల్ హిట్లు అందుకొన్నారు చిరు. ‘విశ్వంభర’ చిత్రానికి రూ.60 కోట్ల పారితోషికం అందుకొన్నట్టు టాక్. ఇప్పుడు ఆయన పారితోషికం రూ.75 కోట్లకు చేరుకొంది. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా కోసం చిరు దాదాపుగా రూ.75 కోట్ల పారితోషికం తీసుకోబోతున్నారని సమాచారం. అయితే.. విశ్వంభర – శ్రీకాంత్ ఓదెల సినిమాల మధ్య చిరు మరో సినిమా చేస్తారు. దీనికి అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ సినిమాకు పారితోషికం ఎంతన్నది తేలాలి.
శ్రీకాంత్ ఓదెల చిరంజీవిని ఎలా చూపించబోతున్నాడన్న ఆసక్తి అందరిలోనూ వుంది. ఈ సినిమా కథ `విక్రమ్` స్టైల్ లో ఉంటుందని, చిరుని ఇప్పటి వరకూ ఎవరూ చూడని ఓ నయా అవతార్‌లో తీర్చిదిద్దబోతున్నాడని టాక్. కేవలం సింగిల్ సిట్టింగ్ లో ఈ కథ ఓకే అయిపోయింది. చిరు దగ్గర సింగిల్ సిట్టింగ్ లో కథ ఓకే అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఆయన కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొంటారు. చిరు దగ్గర కనీసం అరడజను దర్శకులు కథలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఆ కథలన్నీ నెలల తరబడి నుంచీ రీ రైటింగులు చేసుకొంటున్నాయి. అలాంటిది శ్రీకాంత్ ఓదెల ఇలా వెళ్లి, అలా ఓకే చేయించుకొని వచ్చేశాడు. ప్రస్తుతం నానితో `ప్యారడైజ్` తెరకెక్కిస్తున్నాడు శ్రీకాంత్. ఆ తరవాతే… చిరు సినిమా పట్టాలెక్కుతుంది.