టాలీవుడ్లో నెంబర్ వన్ స్థానం ఎవరిదంటే.. ఇప్పటికీ చిరంజీవి పేరు చెప్పాల్సిందే. తొమ్మిదేళ్ల తరవాత రీ ఎంట్రీ ఇచ్చినా – వంద కోట్ల సినిమాతో తన స్టామినా తగ్గలేదని నిరూపించాడు చిరు. అప్పటి వరకూ ఉన్న నాన్ బాహుబలి రికార్డులన్నీ చిరు ఎంట్రీతో కుదేలైపోయాయి. ఆ తరవాత… ఆ రికార్డులు మహేష్ చెరిపేశాడు. అది వేరే సంగతి. `సైరా`తో మళ్లీ తెలుగునాట కొత్త చరిత్ర సృష్టించాడు చిరు. అలా… మహేష్ – చిరు మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకుంది.
అయితే పారితోషికం విషయంలో మహేష్ కాస్త ముందున్నాడు. `సరిలేరు నీకెవ్వరు` సినిమాకి గానూ మహేష్ అందుకున్న పారితోషికం చర్చల్లో నిలిచింది. ఈ సినిమాకి మహేష్ 53 కోట్లు తీసుకున్నాడని టాక్ వినిపించింది. అదే నిజమైతే…. దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయకులలో మహేష్ ఒకడిగా నిలిచిపోతాడు. టాలీవుడ్లో అయితే తనే నెంబర్ వన్. ఖైదీ నెంబర్ 150 సమయంలో చిరు పారితోషికం ఎంతన్నది బయటకు రాలేదు. ఎందుకంటే అది సొంత సినిమా కాబట్టి. సైరాకీ ఇదే పరిస్థితి. ఇప్పుడు కొరటాల శివతో చేస్తున్న సినిమా విషయంలోనూ పారితోషికం అధికారికంగా తెలియకపోవొచ్చు. ఎందుకంటే ఇందులో రామ్ చరణ్ వాటా కూడా ఉంది. చిరు పారితోషికాన్ని.. చరణ్ తన వాటాగా పెట్టినట్టు సమాచారం. సో.. చిరు పారితోషికం ఎంతన్నది లోపాయికారి వ్యవహారమే. అయితే.. చిరు మాత్రం మహేష్ పారితోషికాన్ని బీట్ చేయాలని చూస్తున్నాడట. తన 153వ సినిమాకి మహేష్‌ని క్రాస్ చేసి పారితోషికం అందుకోవాలన్నది ప్రస్తుత టార్గెట్. 153వ సినిమాకి త్రివిక్రమ్ లేదా, బోయపాటి శ్రీను దర్శకులుగా ఎంచుకునే ఛాన్సుంది. నిర్మాత ఎవరన్నది తెలిస్తే చిరు పారితోషికం పక్కా అవుతుంది. 153వ సినిమా నిర్మాణ బాధ్యతలకు చరణ్ దూరం అయితేనే.. చిరు కోరిక తీరుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.