తెలుగు సినీ ఇండస్ట్రీ తీవ్రమైన కష్టాల్లో ఉంది. చిరంజీవి చెప్పినట్లుగా నలుగురు హీరోలు బాగుంటే పరిశ్రమ బాగున్నట్లు కాదు. లక్షల మంది కార్మికులకు రోజువారీ పని దొరకాలి. అందుకే మెగాస్టార్ చిరంజీవి సహకరించాలని ప్రభుత్వాలను కోరారు. అది కూడా సినిమా వేదిక మీద. చిరంజీవికి అంతకు మించిన వేదిక మరేమీ దొరకినట్లుగా లేదు. దాసరి నారాయణరావు తర్వాత టాలీవుడ్‌కు పెద్దగా చిరంజీవి గౌరవం అందుకుంటున్నారు. ఆయనకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాల వద్ద మంచి పలుకుబడి ఉంది. అటు జగన్‌తో ఇటు కేసీఆర్‌తో నాగార్జునతో కలిసి వెళ్లి మరీ రెండేసి సార్లు భేటీలు అయ్యారు. అంత సాన్నిహిత్యం ఉన్నా…సినిమా ప్రమోషన్ కోసం పెట్టిన వేదికపై నుంచి సమస్యలను పరిష్కరించాలని కోరడం మాత్రం కాస్త ఎబ్బెట్టుగా ఉంది.
సినిమా రంగ సమస్యలు పరిష్కరించాలని .. అందు కోసం టిక్కెట్లను ప్రభుత్వమే అమ్మాలని చిరంజీవి, నాగార్జున వంటి వారు కోరారని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అందుకే తాము జీవో తీసుకొచ్చి.. ప్రత్యేకంగా సినిమా పోర్టల్ ద్వారా టిక్కెట్లు అమ్ముతామని కూడా చెబుతోంది. ఈ అంశంపై చిరంజీవి నాగార్జున కూడా స్పందించలేదు. వారు నిజంగా అలా కోరి ఉంటారని అందుకే స్పందించడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమా టిక్కెట్లను కూడా ప్రభుత్వమే అమ్మడం సినిమా ఇండస్ట్రీ సమస్యల పరిష్కారంలో భాగం అయితే… ఇతర డిమాండ్లను కూడా చిరంజీవి ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్న మౌలికంగా వస్తుంది. ఒక వేళ ఇచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదా..? అలా పట్టించుకోకపోతే చిరంజీవి ఎందుకు ప్రశ్నించరు అనేది చాలా మందికి వచ్చే డౌట్.
ఇప్పుడు టాలీవుడ్ నిలబడాలంటే రెండురాష్ట్రాల్లోనూ సమాంతరంగా సినిమాలు విడుదల కావాలి. రెండు చోట్ల టిక్కెట్ల రేట్లు.. ఇతర సమస్యలు పరిష్కారం కావాలి. లేకపోతే సినిమాలు బయటపడే పరిస్థితి లేదు. ఓటీటీకి అమ్ముకోవాలి. రేపు ధియేటర్ బిజినెస్ లేదని తేలితే ఓటీటీ వాళ్లు ఎలా ఆడుకుంటారో చిరంజీవి లాంటి వ్యక్తికి తెలియనిది కాదు. కానీ ఆయన తన పలుకుబడిని సినిమా రంగ పరిశ్రమ సమస్య పరిష్కారానికి ఉపయోగించలేకపోతున్నారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతున్నా రిప్లయ్ ఇవ్వలేకపోతున్నారు.
ఎవరు అవునన్నా.. కాదన్నా.. చిరంజీవిపై ఇప్పుడు చాలా పెద్ద భారం ఉంది. ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి పరిశ్రమను ఆదుకునేలా ఉపశమన చర్యలు చేపట్టాల్సి ఉంది. ఎందుకనో కానీ ఏపీ ప్రభుత్వం భేటీలు అంటూ ప్రకటిస్తోంది కానీ అపాయింట్మెంట్లు ఇవ్వడం లేదు. ఓ రకంగా తెలంగాణ ప్రభుత్వంతో ఇబ్బందుల్లేవు. కానీ ఆయన రెండు ప్రభుత్వాలను కలిపి .. సినిమా వేదిక మీద పరిష్కరించాలని కోరారు కాబట్టి ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం నుంచీ ఆయన కొంత సాయం కోరుతున్నారు. అదేమిటో నేరుగా కలిసికోరాలి కానీ సినిమా ఫంక్షన్ల వేదికలపై కోరితే ఎవరూ పట్టించుకోరనేది అందరికీ తెలిసిన వాస్తవం. చిరంజీవికి కూడా తెలిసే ఉంటుంది.