చిరంజీవి న్యూ ఇయర్ లుక్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గత కొంతకాలంగా ‘సైరా’ కోసం ఆయన గెడ్డం పెంచుతున్నారు. ఈమధ్య సినిమా వేడులకు కూడా గుబురు గడ్డంతోనే వచ్చారు చిరు. ఆ పాత్రకు గెడ్డం కావాల్సిందే. అయితే న్యూ ఇయర్ రోజున ఆయన క్లీన్ షేవ్‌తో కనిపించేసరికి.. అభిమానులతో పాటు, చిత్రసీమ కూడా ఆశ్చర్యపోతోంది. సైరా షూటింగ్ దశలో ఉంది. ఈ దశలో ఆయన క్లీన్ షేవ్‌కి రావడం పుకార్లకు ఊతం ఇచ్చేలానే ఉంది. ‘సైరా’ షూటింగ్ మళ్లీ ఫిబ్రవరిలో అని చిత్రబృందం చెబుతోంది. అందుకే చిరు క్లీన్ షేవ్‌లోకి వెళ్లారనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే మళ్లీ ఆ స్థాయిలో గెడ్డం పెరగాలంటే చాలా సమయం పడుతుంది. `సైరా`లో మార్పులు జరుగుతున్నాయని, అవన్నీ ఓ కొలిక్కి వచ్చేంత వరకూ సినిమా షూటింగ్‌ని నిలిపి వేశారని, అందుకే చిరు కి గెడ్డం నుంచి విముక్తి లభించిందని చెప్పుకుంటున్నారు. అయితే చిత్రబృందం మాత్రం పుకార్లకు గట్టిగా బదులు ఇస్తోంది. ‘సైరా’ లో మార్పుల్లేవు అని చెప్పుకొస్తుంది. ఈ నేపథ్యంలో చిరు అవతారం చూస్తే… కొత్త అనుమానాలు రేకెత్తడం ఖాయం. గెడ్డం లేకుండా ఏమైనా సన్నివేశాలు ఉండబోతున్నాయా? వాటి కోసమే చిరు ఇలా కనిపిస్తున్నాడా? లేదంటే ఏకంగా సినిమాని పక్కన పెట్టేశారా? అనేవి ‘సైరా’కి సంబంధించిన లేటెస్టు డౌట్స్.