స్నేహితుడు నాగార్జున కోసం, ఆయన చిన్న కుమారుడు అఖిల్ రెండో సినిమా ‘హలో’ ప్రీ-రిలీజ్ వేడుకకు కుమారుడు రామ్ చరణ్ తో కలసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు చిరంజీవి. అప్పటికే సినిమా చూసిన చిరంజీవి “విడుదలకు ముందు సినిమా చూసి ఎలా ఉందొ చెప్పడం పరీక్షేనంటూ ‘హలో’ బహు బాగుంద”ని మెచ్చుకున్నారు. “హలో ఆల్ క్లాస్ సినిమా” అన్నారు. కానీ, విడుదలైన తర్వాత కొన్ని క్లాసులకు మాత్రమే ‘హలో’ పరిమితమైంది. విమర్శకుల్లోనూ కొంతమందికి మాత్రమే నచ్చింది. ఓవరాల్ వసూళ్లు చూస్తే నష్టాలు తప్పలేదని అర్థమైంది. కానీ, చిరంజీవి మాత్రం ‘హలో’ హిట్టని అంటున్నారు. నాగశౌర్య ‘ఛలో’ ప్రీ-రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి “రెండు మూడేళ్లుగా పెద్ద హీరోల సినిమాలు ఎంతగా హిట్ అయ్యాయో.. యంగ్ హీరోల సినిమాలూ అంతకు మించి హిట్టయ్యాయి. ఉదాహరణకు… ‘ఊహాలు గుసగుసలాడే’, ‘పెళ్లిచూపులు’, ‘ఉయ్యాలా జంపాలా’, ‘అర్జున్ రెడ్డి’, ‘శతమానం భవతి’, ‘ఫిదా’, ‘హలో’… చిత్రాలను, కొత్తవారందరినీ ఆదరించే మంచి మనసున్న ప్రేక్షకులు మన తెలుగు ప్రేక్షకులు” అన్నారు. ఛలో… హలో హిట్టని చెప్పడం వరకూ పర్వాలేదు. నాగార్జున కోసం అనుకోవచ్చు. కానీ, ‘ఫిదా’, ‘అర్జున్ రెడ్డి’ వంటి పాత్ బ్రేకింగ్ సినిమాలతో కంపేర్ చేయడం ప్రేక్షకులకు కాస్త ఓవర్ అన్పించింది.